ఖమ్మం వార్తలు

కొత్తగూడెంలో కిడ్నాప్ కలకలం.. బీఆర్ఎస్ కార్పొరేటర్ అదృశ్యం!

  • కొత్తగూడెం మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకీ రాని స్పష్టమైన మెజారిటీ 
  • మేయర్ పీఠం కోసం పార్టీల మధ్య హోరాహోరీ పోరు
  • తమ కార్పొరేటర్‌ను కాంగ్రెస్ కిడ్నాప్ చేసిందంటూ బీఆర్ఎస్ ఆరోపణ
  • మాజీ మంత్రి వనమా ఆధ్వర్యంలో నిరసన, పోలీసులకు ఫిర్యాదు
  • గెలిచిన అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్న ప్రధాన పార్టీలు

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడిన గంటల్లోనే రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఏ పార్టీకీ మేయర్ పీఠం దక్కించుకోవడానికి అవసరమైన సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో క్యాంపు రాజకీయాలు, కిడ్నాప్ ఆరోపణలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమ పార్టీ తరఫున గెలిచిన కార్పొరేటర్‌ను కాంగ్రెస్ పార్టీ కిడ్నాప్ చేసిందని బీఆర్ఎస్ ఆరోపించడం తీవ్ర కలకలం రేపుతోంది.

శుక్రవారం వెలువడిన ఫలితాల్లో 32వ డివిజన్ నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచిన గుగులోతు రాంబాబు అదృశ్యమయ్యారు. కాంగ్రెస్ నాయకులే రాంబాబును బలవంతంగా తీసుకెళ్లారని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఆరోపించారు. రాంబాబు భార్య నాగమణితో కలిసి ఆయన నివాసం వద్ద ధర్నాకు దిగారు. అధికార పార్టీ అండతోనే ఈ కిడ్నాప్ జరిగిందని, తమ కార్పొరేటర్‌ను వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు.

మొత్తం 60 స్థానాలున్న ఈ కార్పొరేషన్‌లో మేయర్ పీఠానికి 31 మంది సభ్యుల మద్దతు అవసరం. తాజా ఫలితాల్లో కాంగ్రెస్, సీపీఐ చెరో 22 స్థానాలు గెలుచుకోగా, బీఆర్ఎస్ 8, స్వతంత్రులు 6, బీజేపీ 1 స్థానంలో విజయం సాధించాయి. దీంతో హంగ్ ఏర్పడింది. మేయర్ ఎన్నిక తేదీ (ఫిబ్రవరి 16) దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు చేజారకుండా ఉండేందుకు పార్టీలన్నీ వారిని రహస్య ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఈ క్రమంలోనే సీపీఐకి మేయర్ పదవి ఇచ్చేందుకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించడంతో సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారాయి. రాంబాబు అదృశ్యంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

ప్రభుత్వం వైద్య ఉద్యోగులకు అన్యాయం చేయవద్దు…ఖమ్మం జిల్లా టీఎన్జీఓ అధ్యక్షుడు అఫ్జల్ హాసన్!

Ram Narayana

పాల్వంచలో సినిమా ఫక్కీలో ఆగిన పెళ్లి ….

Ram Narayana

ఖమ్మంలో తమిళనాడు ఎక్స్ ప్రెస్ కు హాల్ట్…ఎంపీ వద్దిరాజు వినతికి స్పందన

Ram Narayana