- కొంతకాలంగా డిమెన్షియాతో బాధపడుతున్న ముకుల్ రాయ్
- ఒకప్పుడు మమతకు కుడిభుజం, తర్వాత బీజేపీలో కీలక వ్యూహకర్త
- 2021లో తిరిగి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన ముకుల్ రాయ్
- ముకుల్ మృతికి మమతా బెనర్జీ సంతాపం
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక శకాన్ని శాసించిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ముకుల్ రాయ్ (71) కన్నుమూశారు. కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 1:30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. తీవ్రమైన గుండెపోటు కారణంగా మరణించినట్లు ఆయన కుమారుడు శుభ్రాంషు రాయ్ ధ్రువీకరించారు. సోమవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
గత రెండేళ్లుగా ముకుల్ రాయ్ డిమెన్షియా వ్యాధితో బాధపడుతున్నారు. అనారోగ్యం కారణంగా ఆయన జ్ఞాపకశక్తి పూర్తిగా కోల్పోయి, చివరి రోజుల్లో ఆత్మీయులను సైతం గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్నారు. కొన్ని రోజులుగా కోమాలో ఉన్న ఆయనకు ట్యూబ్ ద్వారానే ఆహారం అందిస్తూ వచ్చారు.
1998లో మమతా బెనర్జీతో కలిసి తృణమూల్ కాంగ్రెస్ (TMC)ను స్థాపించిన ముకుల్ రాయ్, పార్టీలో నంబర్ 2 స్థాయికి ఎదిగారు. 2011లో లెఫ్ట్ ఫ్రంట్ పాలనను గద్దె దించడంలో కీలక పాత్ర పోషించారు. అయితే, 2017లో బీజేపీలో చేరి అందరినీ ఆశ్చర్యపరిచారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో బీజేపీ 18 స్థానాలు గెలవడం వెనుక ఆయన వ్యూహాలే ముఖ్య కారణమని చెబుతారు.
అనంతరం 2021 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన తిరిగి టీఎంసీ గూటికి చేరారు. అయితే, అనారోగ్యం కారణంగా ఆయన రాజకీయంగా క్రియాశీలకంగా ఉండలేకపోయారు. ముకుల్ రాయ్ మృతిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పార్టీ ఒక మేధావిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, గత ఏడాది ఫిరాయింపుల నిరోధక చట్టం కింద కలకత్తా హైకోర్టు ఆయనపై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే.