అంతర్జాతీయం

అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి…

  • ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార క్షిపణి దాడులు
  • పశ్చిమాసియాలో భగ్గుమన్న ఉద్రిక్తతలు.. ప్రపంచ దేశాల ఆందోళన
  • సంయమనం పాటించాలని భారత్, ఫ్రాన్స్, ఐరాస పిలుపు
  • ఖొమైనీ మరణాన్ని అధికారికంగా ప్రకటించిన ఇరాన్

పశ్చిమాసియాలో ఒక్కసారిగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన భారీ దాడిలో ఆ దేశ సర్వోన్నత నేత అయతొల్లా అలీ ఖొమైనీ (86) హతమయ్యారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు. 36 ఏళ్లుగా ఇరాన్‌ను శాసిస్తున్న ఖొమైనీ మరణంతో 46 ఏళ్ల షియా పాలన కీలక మలుపు తీసుకుంది.

ఈ దాడికి ప్రతీకారంగా ఇరాన్ వెంటనే ఎదురుదాడులకు దిగింది. ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా సైనిక స్థావరాలున్న ఖతార్, బహ్రెయిన్, యూఏఈ, జోర్డాన్, కువైట్‌లపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. “తమ నిఘా, అధునాతన ట్రాకింగ్ వ్యవస్థల నుంచి ఖొమైనీ తప్పించుకోలేకపోయారు. ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి చేజిక్కించుకోవడానికి ఇదే గొప్ప అవకాశం” అని ట్రంప్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

ఖొమైనీ మరణాన్ని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ధ్రువీకరించింది. దీంతో ఆ దేశంలో తదుపరి నాయకత్వంపై అనిశ్చితి నెలకొంది. మరోవైపు, ఇరాన్‌లోని సుమారు 20 నగరాలపై దాడులు జరిగాయని ఐరాస నివేదికలు చెబుతున్నాయి.

ఈ పరిణామాలపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఉద్రిక్తతలు ప్రమాదకరంగా మారుతున్నాయని, వెంటనే ఆగాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ పిలుపునిచ్చారు. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇరాన్, ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రులతో ఫోన్‌లో మాట్లాడి, సంయమనం పాటించాలని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ఇరుపక్షాల సైనిక చర్యలను ఖండించారు.

అమెరికా దాడుల్లో ఖమేనీ కుమార్తె, మనవరాలు మృతి.. ధ్రువీకరించిన ఇరాన్ మీడియా

Ali Khameneis Daughter Grandchild Killed in US Airstrike Iran Media Confirms
  • అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ వారసులు ఖతం
  • మరణించిన వారిలో కుమార్తె, మనుమరాలు, అల్లుడు
  • ధ్రువీకరించిన ఇరాన్ అధికారిక మీడియా సంస్థలు
  • మృతుల్లో కోడలు కూడా ఉన్నట్లు వెల్లడి

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ నివాసంపై జరిగిన వైమానిక దాడుల్లో ఆయన కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడిలో ఖమేనీ కుమార్తె, మనుమరాలితో పాటు ఆయన అల్లుడు, కోడలు కూడా మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ధ్రువీకరించింది. ఖమేనీ నివాసం ఉండే కాంపౌండ్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడుల్లో ఆయన కుటుంబం మొత్తం చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.

ఖమేనీ మరణంపై ఇప్పటికే భిన్న కథనాలు వస్తున్న తరుణంలో, ఆయన కుటుంబ సభ్యుల మృతిని ఇరాన్ మీడియా స్వయంగా ప్రకటించడం గమనార్హం. ఖమేనీ వారసులు ఈ దాడుల్లో బలికావడం ఇరాన్ పాలకులకు కోలుకోలేని దెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఖతం.. ఇక వారసుడెవరు?

Ali Khamenei Death Throws Iran into Turmoil
  • తదుపరి నాయకుడి ఎంపికపై నెలకొన్న తీవ్ర అనిశ్చితి
  • రేసులో ఖమేనీ కుమారుడు, మనుమడు
  • నాయకుడి ఎంపికలో కీలకం కానున్న రివల్యూషనరీ గార్డ్స్
  • ఇతర నేతల భవితవ్యంపై వీడని మిస్టరీ

అమెరికా, ఇజ్రాయెల్ మెరుపు దాడుల్లో ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. మూడు దశాబ్దాలకు పైగా దేశాన్ని శాసించిన ఆయన మరణంతో ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థ మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ పరిణామం దేశ పునాదులనే కదిలించగా, తదుపరి నాయకత్వంపై తీవ్ర అనిశ్చితి నెలకొంది.

ఖమేనీ మరణానంతరం తదుపరి ‘సుప్రీం లీడర్’ ఎవరనే దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం, ఒక సీనియర్ మతగురువు మాత్రమే ఈ పదవిని చేపట్టగలరు. ప్రస్తుతం ఖమేనీ కుమారుడు మెజ్తబా ఖమేనీ, వ్యవస్థాపకుడు ఖమేనీ మనుమడు హసన్ ఖమేనీ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే, ఖమేనీకి ఉన్నంతటి పట్టు, అధికారం ప్రస్తుత నేతల్లో ఎవరికీ లేకపోవడం గమనార్హం.

ఇరాన్‌లో ఎన్నికైన ప్రభుత్వం కంటే సుప్రీం లీడర్ ఆధ్వర్యంలోని ‘రివల్యూషనరీ గార్డ్స్’ (IRGC) అత్యంత శక్తిమంతమైనది. ఈ దాడుల్లో ఐఆర్జీసీ కమాండర్ మహమ్మద్ పాక్పూర్ కూడా మరణించినట్లు సమాచారం. దేశ రాజకీయ, వ్యాపార రంగాలను శాసించే ఈ సైనిక విభాగమే తదుపరి నాయకుడి ఎంపికలో నిర్ణయాత్మక శక్తిగా మారనుంది.

మరోవైపు, ఈ దాడుల్లో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌ను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అనేకమంది అగ్రనేతల భవితవ్యంపై అనిశ్చితి నెలకొంది. ఒకవేళ ఇరాన్ అగ్ర నాయకత్వం మొత్తం తుడిచిపెట్టుకుపోతే, ఆ దేశంలో ప్రజాస్వామ్య విప్లవం రావొచ్చని కొందరు అంతర్జాతీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

ఖమేనీ మృతదేహం ఫోటోలు ట్రంప్, నెతన్యాహుకు అందాయి: ఇజ్రాయెల్ మీడియా

Ali Khamenei Death Photos Shown to Trump Netanyahu Israel Media
  • నివాసంపై వైమానిక దాడిలో మరణించారని ప్రచారం
  • శిథిలాల నుంచి మృతదేహాన్ని వెలికితీసినట్లు వెల్లడి
  • మృతదేహం ఫోటోలను ట్రంప్, నెతన్యాహులకు చూపినట్లు కథనాలు

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారంటూ ఇజ్రాయెల్ మీడియాలో సంచలన కథనాలు వెలువడుతున్నాయి. ఆయన నివాసంపై జరిగిన వైమానిక దాడి తర్వాత, శిథిలాల నుంచి ఖమేనీ మృతదేహాన్ని వెలికితీశారని ఇజ్రాయెల్ అధికారిక మీడియా సంస్థ ‘కాన్’ వెల్లడించింది. ఈ వార్త అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.

ఇజ్రాయెల్ టీవీ నెట్‌వర్క్ ఛానల్ 12 ప్రసారం చేసిన కథనం ప్రకారం, ఖమేనీ మృతదేహానికి సంబంధించిన ఫోటోలను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లకు చూపించారు. “ఖమేనీ ఎలిమినేషన్” (తొలగింపు) ఆపరేషన్ పూర్తయినట్లు ఇజ్రాయెల్ ఉన్నతాధికారులకు సమాచారం అందిందని నివేదికలు పేర్కొంటున్నాయి. అత్యంత కచ్చితత్వంతో ఈ దాడి జరిగిందని, దానికి ఈ ఫోటోలే నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఖమేనీ శకం ముగిసిపోయిందని, ఈ ఆపరేషన్ విజయవంతమైందనడానికి తమ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని ఇజ్రాయెల్ పేర్కొంది. ఈ పరిణామంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.  

మరణానికి కొద్ది నిమిషాల ముందు ఖురాన్ వాక్యంతో ఖమేనీ పోస్ట్.. ‘‘దైవానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా’’

Khamenei last post Quran quote before death
  • ‘అమరవీరుడిని’ అవుతున్నానంటూ సంకేతం
  • అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో ఖమేనీ సహా 40 మంది ఉన్నతాధికారుల మృతి
  • ఇరాన్ ప్రతీకార దాడితో గల్ఫ్ అతలాకుతలం.. అబుదాబి, దుబాయ్‌లపై క్షిపణుల వర్షం

‘‘విశ్వాసులలో కొందరు దేవునికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు.. మరికొందరు ఆ సమయం కోసం వేచి చూస్తున్నారు’’.. మరణానికి కొద్ది నిమిషాల ముందు ఇరాన్ అత్యున్నత నేత అయతుల్లా అలీ ఖమేనీ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసిన ఖురాన్ వాక్యం ఇది. 86 ఏళ్ల ఖమేనీ, శనివారం జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల్లో మరణించినట్లు ఇరాన్ అధికారికంగా ధృవీకరించింది. తన మరణం తథ్యమని తెలిసి ఆయన చేసిన ఈ చివరి పోస్ట్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
వారసత్వ పోరు..

1989 నుంచి ఇరాన్ విధి రాతను శాసించిన ఖమేనీ మరణంతో ఆ దేశంలో 35 ఏళ్ల శకం ముగిసింది. టెహ్రాన్‌లోని ఆయన నివాసంపై జరిగిన ‘లయన్స్ రోర్’ ఆపరేషన్‌లో ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, మనవరాలు సహా పలువురు కీలక సేనాధిపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడితో ఇరాన్ పాలక వర్గంలో పెను మార్పులు రాబోతున్నాయి. అధికార మార్పిడి కోసం ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఇప్పటికే రంగంలోకి దిగింది.

మహా యుద్ధం మొదలైందా..

ఖమేనీ మరణ వార్త బయటకు వచ్చిన వెంటనే ఇరాన్ ప్రతీకార జ్వాలలతో రగిలిపోయింది. ‘ట్రూ ప్రామిస్ 4’ పేరుతో అమెరికా మిత్రదేశాలైన యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియా, బహ్రెయిన్‌లపై వందలాది క్షిపణులను ప్రయోగించింది. అంతర్జాతీయ విమానాశ్రయాలపై డ్రోన్ దాడులు జరగడంతో విమాన రాకపోకలు నిలిచిపోయాయి. యూఏఈ ప్రభుత్వం ప్రజలకు అత్యవసర ‘మిస్సైల్ అలర్ట్’ జారీ చేసి, షెల్టర్లలోకి వెళ్లాలని ఆదేశించింది.సంతాప దినాలు.. సంబరాలు..
ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వం 40 రోజుల సంతాప దినాలను ప్రకటించగా, మరోవైపు ఇరాన్ పౌరులు తమ దేశ స్వేచ్ఛ కోసం రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాలన్నీ పశ్చిమ ఆసియాలో రేగబోయే ఈ మహా సంగ్రామం గురించి ఆందోళన చెందుతున్నాయి.

చరిత్ర నుంచి ఖమేనీని తుడిచిపెట్టాం: ఇరాన్ షా కుమారుడి సంచలన ప్రకటన

Reza Pahlavi Khamenei Erased from History
  • ఇస్లామిక్ రిపబ్లిక్ పాలన కూడా అంతమైందని వ్యాఖ్య
  • ప్రజలతో చేతులు కలపాలని ఇరాన్ సైనిక బలగాలకు పిలుపు
  • నిరసనలకు సిద్ధంగా ఉండాలని ఇరాన్ ప్రజలను కోరిన పహ్లావి

ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ శకం ముగిసిందని, ఆయనను చరిత్ర పుటల నుంచి తుడిచిపెట్టేశామని ఇరాన్ చివరి షా కుమారుడైన రెజా పహ్లావి సంచలన ప్రకటన చేశారు. ఖమేనీ మరణంతో ఇస్లామిక్ రిపబ్లిక్ పాలన కూడా వాస్తవంగా ముగిసిపోయిందని ఆయన అన్నారు. 

ఇరాన్ ప్రజలను ఉద్దేశించి పహ్లావి ఒక ప్రకటన విడుదల చేశారు. “ఖమేనీ మన కాలంలోని రక్తపిపాసి నియంత. ఇరాన్‌కు చెందిన వేలాది మంది ధైర్యవంతులైన యువతీయువకులను హత్య చేసిన వ్యక్తి. ఆయన మరణంతో ఇస్లామిక్ రిపబ్లిక్ అంతం మొదలైంది. త్వరలోనే దాన్ని చరిత్ర చెత్తబుట్టలో పడేస్తాం” అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఖమేనీ స్థానంలో వారసుడిని నియమించేందుకు పాలనాయంత్రాంగం చేసే ఏ ప్రయత్నమైనా విఫలమవుతుందని హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఇరాన్ సైనిక, భద్రతా బలగాలకు పహ్లావి ఒక విజ్ఞప్తి చేశారు. “కూలిపోతున్న ప్రభుత్వాన్ని కాపాడే ఏ ప్రయత్నమైనా విఫలమవుతుంది. దేశ ప్రజలతో చేతులు కలపడానికి ఇదే మీకు చివరి అవకాశం” అని ఆయన పిలుపునిచ్చారు. ఖమేనీ మరణం చిందిన రక్తాన్ని వెనక్కి తీసుకురాలేకపోయినా, బాధితుల కుటుంబాలకు ఇది కొంత ఊరటనిస్తుందని అన్నారు.

ఇరాన్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భారీ నిరసనలకు సిద్ధం కావాలని పహ్లావి కోరారు. దశాబ్దాలుగా అమెరికాలో ప్రవాస జీవితం గడుపుతున్న రెజా పహ్లావి, ఖమేనీ అనంతరం ఇరాన్‌ను ప్రజాస్వామ్యం వైపు నడిపించేందుకు తాను తాత్కాలిక నాయకుడిగా తిరిగి వస్తానని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

ఖమేనీ శకం ముగిసింది.. వీధుల్లోకి వచ్చి ప్రజల ఆనందోత్సాహాలు

Ali Khamenei Era Ends Iranians Celebrate in Streets
  • ఖమేనీ మరణవార్తతో పలు నగరాల్లో వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్న ప్రజలు
  • హంతకులపై తీవ్ర ప్రతీకారం తీర్చుకుంటామన్న ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్
  • ఖమేనీని హతమార్చింది తామేనని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
  • ప్రతీకారంగా పలు దేశాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు ప్రారంభించిన ఇరాన్

నాలుగున్నర దశాబ్దాల ఇరాన్ షియా పాలనలో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశాన్ని 36 ఏళ్లుగా ఉక్కుపిడికిలితో ఏలిన సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (86) శకం ముగిసింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన మెరుపుదాడిలో ఆయన హతమయ్యారు. ఈ వార్త పశ్చిమాసియాలో కార్చిచ్చులా వ్యాపించగా, ఇరాన్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒకవైపు ప్రభుత్వం ప్రతీకారంతో రగిలిపోతుంటే, మరోవైపు ప్రజలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ఘటనతో యావత్ పశ్చిమాసియా యుద్ధ మేఘాల నీడలోకి జారుకుంది.

ఖమేనీ మరణవార్తను ధ్రువీకరించిన వెంటనే, టెహ్రాన్, ఇస్ఫహాన్, షిరాజ్, కరాజ్ వంటి ప్రధాన నగరాల్లో అసాధారణ దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. ప్రభుత్వ ఆంక్షలను, ఇంటర్నెట్ షట్‌డౌన్‌ను సైతం లెక్కచేయకుండా వేలాది మంది ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. కొందరు భవనాలపైకి ఎక్కి ఆనందంతో కేరింతలు కొట్టగా, మరికొందరు వీధుల్లో నృత్యాలు చేస్తూ, మిఠాయిలు పంచుకుంటూ తమ స్వేచ్ఛను ప్రకటించుకున్నారు. “నియంతృత్వ పాలన అంతమైంది” అంటూ నినాదాలు చేశారు. స్టార్‌లింక్ వంటి శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ఉపయోగించి కొందరు ఈ సంబరాల వీడియోలను ప్రపంచానికి చేరవేయడంతో అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇటీవల ద్రవ్యోల్బణం, కఠినమైన సామాజిక నియమాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేసిన నేపథ్యంలో, ప్రజాగ్రహం ఈ రూపంలో బయటపడిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ హత్యపై ఇరాన్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కమాండర్లు అత్యవసరంగా సమావేశమై “ఈ దుశ్చర్యకు కారణమైన హంతకులపై చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో ప్రతీకారం తీర్చుకుంటాం” అని భీకర ప్రతిజ్ఞ చేశారు. ఇరాన్ క్యాబినెట్ సైతం అమెరికా, ఇజ్రాయెల్‌కు తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. “మా సుప్రీం లీడర్ నెత్తుటిబొట్టుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు” అని అధికారిక ప్రకటన విడుదల చేసింది.

మరోవైపు, ఈ దాడిని తామే నిర్వహించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. తన ట్రూత్ సోషల్ ఖాతాలో “ఇజ్రాయెల్‌తో కలిసి అత్యంత పకడ్బందీగా ఈ ఆపరేషన్ పూర్తిచేశాం. మా అత్యాధునిక నిఘా వలయం నుంచి ఖమేనీ తప్పించుకోలేకపోయారు” అని పేర్కొన్నారు.

ఈ ప్రకటన వెలువడిన వెంటనే ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌తో పాటు, అమెరికా సైనిక స్థావరాలున్న ఖతార్, యూఏఈ, బహ్రెయిన్, కువైట్‌లపై డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో పశ్చిమాసియా గగనతలం యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. ఒమన్ మధ్యవర్తిత్వంతో జెనీవాలో జరిగిన చర్చలు విఫలమైన 48 గంటల్లోపే ఈ దాడి జరగడం గమనార్హం.

ఖమేనీ మరణంతో ఇరాన్ రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఆయన స్థానంలో ఎవరు వస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో, ఈ పరిణామం పశ్చిమాసియాను నిలువునా భగ్గుమనే పెను ప్రమాదంలోకి నెట్టింది.

ఖమేనీ మరణం తర్వాత బాంబు పేలుళ్లలతో దద్దరిల్లిన దోహా, దుబాయ్ ఎయిర్ పోర్టు

Ali Khamenei Death Sparks Bombings at Doha Dubai Airports
  • టెహ్రాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్
  • ఖమేనీ మరణాన్ని ధ్రువీకరించిన ఇరాన్.. ప్రతీకార చర్యలకు పిలుపు
  • దుబాయ్, దోహా, బహ్రెయిన్‌లపై ఇరాన్ మిస్సైల్ దాడులు.. గల్ఫ్ దేశాల్లో హైఅలర్ట్
  • మూతపడిన గగనతలాలు.. భారీగా ప్రాణనష్టం జరిగినట్లు అనుమానం

మధ్యప్రాచ్యం అగ్నిగుండంగా మారింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం.. ఇప్పుడు పూర్తిస్థాయి యుద్ధంగా రూపుదాల్చింది. యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచే అనూహ్య పరిణామంలో, ఇరాన్ అత్యున్నత నేత అయతొల్లా అలీ ఖమేనీ అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో హతమయ్యారు. ఈ వార్తతో భగ్గుమన్న ఇరాన్, ప్రతీకార జ్వాలలతో రగిలిపోతోంది. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. దీంతో గల్ఫ్ దేశాలు దద్దరిల్లిపోతున్నాయి.

‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాలు అత్యంత పకడ్బందీగా ఈ దాడిని నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆదివారం తెల్లవారుజామున టెహ్రాన్‌లోని ఖమేనీ అధికారిక నివాసం, కార్యాలయాలను లక్ష్యంగా చేసుకొని అత్యాధునిక స్టెల్త్ బాంబర్లతో ఈ భీకర దాడులు జరిపినట్లు సమాచారం. ఈ దాడిలో ఖమేనీతో పాటు పలువురు ఉన్నతస్థాయి కమాండర్లు కూడా మరణించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. కొద్దిసేపటికే ఇరాన్ ప్రభుత్వ మీడియా, ఖమేనీ మరణ వార్తను అధికారికంగా ధ్రువీకరించింది. “మన అత్యున్నత నేత అమరుడయ్యారు. ఈ దారుణానికి ప్రతీకారం తీర్చుకుంటాం” అని ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఓ ప్రకటనలో హెచ్చరించింది.

ఖమేనీ మరణవార్త వెలువడిన గంటల వ్యవధిలోనే ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. తమ బాలిస్టిక్ క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లతో గల్ఫ్ దేశాల్లోని అమెరికా, దాని మిత్రదేశాల సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది.

యూఏఈ: దుబాయ్‌లోని అల్-దఫ్రా ఎయిర్ బేస్, అబుదాబిలోని అమెరికా సైనిక శిబిరాలపై క్షిపణుల వర్షం కురిపించింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోనూ భారీ పేలుళ్లు సంభవించినట్లు స్థానిక మీడియా పేర్కొంటోంది.

ఖతార్: మధ్యప్రాచ్యంలో అమెరికాకు అతిపెద్ద సైనిక స్థావరం ఉన్న ఖతార్‌లోని అల్-ఉదెయిద్ ఎయిర్ బేస్‌పై ఇరాన్ భీకర దాడులు జరుపుతోంది.

బహ్రెయిన్, జోర్డాన్: ఈ దేశాల్లోని అమెరికా నావికాదళ స్థావరాలు, సైనిక శిబిరాలపై కూడా దాడులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ వరుస పేలుళ్లతో గల్ఫ్ ప్రాంతమంతా భయంతో వణికిపోతోంది. యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా తమ గగనతలాలను పూర్తిగా మూసివేశాయి. ప్రజలను ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేశాయి.

ఈ అనూహ్య పరిణామాలతో ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిని “ఉగ్రవాదంపై చారిత్రక విజయం”గా అభివర్ణించగా, రష్యా, చైనాలు సంయమనం పాటించాలని ఇరుపక్షాలకు విజ్ఞప్తి చేశాయి. ఈ యుద్ధం ముడిచమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్థిరతకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్షణక్షణానికీ మారుతున్న పరిస్థితులతో మధ్యప్రాచ్యం భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఈ పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా అన్న భయాందోళనలు సర్వత్ర వ్యక్తమవుతున్నాయి.

అణు దాడిని కూడా తట్టుకునే ఖమేనీ కోటను ఎలా బద్దలు కొట్టారంటే..!

Khamenei Operation Epic Fury US Israel break Khamenei nuclear proof fortress
  • అమెరికా-ఇజ్రాయెల్ అనుసరించిన ఆ 3 వ్యూహాలు ఇవే..
  • చీకటిలో కాకుండా పట్టపగలే మెరుపు దాడి.. ఇరాన్ తేరుకునేలోపే ముగిసిన ఆపరేషన్
  • జలంతర్గాముల నుంచి టోమాహాక్ క్షిపణులు.. గాలిలో అమెరికా స్టెల్త్ ఫైటర్ల గర్జన
  • ప్రపంచం తొలిసారి చూసిన సరికొత్త ‘సూసైడ్ డ్రోన్ల’ దాడులు

ఇరాన్ అత్యున్నత అధికార కేంద్రం ‘పాశ్చర్ స్ట్రీట్’ లోని సుప్రీం లీడర్ నివాసం అత్యంత పటిష్ఠమైన భద్రతకు మారుపేరు. అణుదాడులను కూడా తట్టుకునేలా నిర్మించిన ఆ కోటను బద్దలుకొట్టడానికి అమెరికా, ఇజ్రాయెల్ అత్యంత సంక్లిష్టమైన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ ని అమలు చేశాయి. ఈ దాడి ఎలా జరిగిందనే అంశం ఇప్పుడు అంతర్జాతీయ రక్షణ నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

వ్యూహం – 1: పగటి పూట దాడులతో విస్మయం
సాధారణంగా ఏ దేశమైనా వైమానిక దాడులను శత్రువు అప్రమత్తంగా లేని అర్ధరాత్రి వేళల్లో చేపడుతుంది. కానీ, ఈసారి అమెరికా-ఇజ్రాయెల్ వ్యూహకర్తలు దీనికి భిన్నంగా పగటిపూట దాడులు ప్రారంభించారు. ఇరాన్ అధికారులు కార్యాలయాల్లో సమావేశమై ఉండే సమయాన్ని ఎంచుకుని, వారు ఊహించని విధంగా విరుచుకుపడ్డారు.

వ్యూహం – 2: భూమి, ఆకాశం, సముద్రం.. ముప్పేట దాడి
టెహ్రాన్ నగరాన్ని మూడు వైపుల నుంచి చుట్టుముట్టేలా ఈ ఆపరేషన్ ప్లాన్ చేశారు. పర్షియన్ గల్ఫ్‌లో ఉన్న అమెరికా యుద్ధ నౌకలు, జలంతర్గాముల నుంచి వేలాది కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ‘టోమాహాక్’ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించారు. అమెరికాకు చెందిన ఎఫ్-35 స్టీల్త్ ఫైటర్లు, బి-2 బాంబర్లు రాడార్లకు చిక్కకుండా ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించి ‘పిన్ పాయింట్’ బాంబు దాడులు చేశాయి. సరిహద్దు దేశాల నుంచి హైమార్స్ రాకెట్ సిస్టమ్స్ ద్వారా ఖచ్చితమైన లక్ష్యాలపై దాడులు జరిగాయి.

వ్యూహం – 3: సరికొత్త ‘లుకాస్’ డ్రోన్ల వినియోగం
ఈ ఆపరేషన్‌లో అతిపెద్ద హైలైట్.. లో కాస్ట్ అన్ మ్యాన్డ్ కాంబాట్ అటాక్ సిస్టం(లుకాస్) డ్రోన్లు. అమెరికా సైన్యం తొలిసారిగా ఈ కమికేజ్ (సూసైడ్) డ్రోన్లను భారీ స్థాయిలో వాడింది. ఇరాన్ సొంతంగా తయారు చేసుకునే షాహెద్ డ్రోన్ల తరహాలో ఉండే ఈ డ్రోన్లు గుంపులుగా వచ్చి ఇరాన్ రక్షణ వ్యవస్థలైన ఎస్-300 క్షిపణులను ఏమార్చి, ఖమేనీ నివాసాన్ని నేరుగా తాకాయి. శాటిలైట్ చిత్రాల ప్రకారం.. కేవలం నిమిషాల వ్యవధిలోనే ఆ ప్రాంతమంతా శిథిలాల కుప్పగా మారిపోయింది. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసిన తర్వాతే ఈ దాడులు జరగడం విశేషం.

Related posts

హమాస్‌తో లష్కరే భేటీ.. వీడియోలో బయటపడిన కొత్త ఉగ్ర బంధం!

Ram Narayana

జమైకాలో తెలుగు వైద్యుడికి అరుదైన గౌరవం…

Ram Narayana

తొలిసారి రష్యన్ చాపర్‌ను పడగొట్టిన ఉక్రెయిన్ నేవల్ డ్రోన్!

Ram Narayana