క్రికెట్ వార్తలు

అభిషేక్ క్రేజ్ చూసి మాకు అసూయ వేసేది: సంజు శాంసన్…

టీ20 ప్రపంచకప్ 2026ను ముద్దాడిన ఆనందంలో ఉన్న టీమిండియా సభ్యులు తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ‘ఇండియా టుడే కాన్‌క్లేవ్’లో పాల్గొన్న సంజూ శాంసన్, తన ఓపెనింగ్ భాగస్వామి అభిషేక్ శర్మపై ప్రశంసలు కురిపిస్తూనే ఒక సరదా నిజాన్ని బయటపెట్టారు. జట్టులో అభిషేక్‌కు ఉన్న క్రేజ్ చూసి తామంతా ఒకానొక సమయంలో అసూయపడ్డామని నవ్వుతూ చెప్పుకొచ్చారు.

“అభిషేక్ ఇప్పుడు టీమిండియాకు అసలైన సూపర్ స్టార్. మేము ఎక్కడికి వెళ్లినా, బస్సును ఫ్యాన్స్ చుట్టుముట్టి ‘అభిషేక్.. అభిషేక్..’ అని అరుస్తుంటే మాకు ఆశ్చర్యం వేసేది. అందరూ ఇతన్నే చూస్తున్నారా? మమ్మల్ని ఎవరూ గమనించడం లేదా? అని జట్టులోని కుర్రాళ్లం ఒకరి మొహాలు ఒకరం చూసుకుని సరదాగా ఈర్ష్య పడేవాళ్లం” అని సంజూ పేర్కొన్నాడు. అభిషేక్ వ్యక్తిత్వం, అతడు ఆటను ఆస్వాదించే తీరు అందరికీ ఇష్టమని చెప్పాడు.

సంజూ-అభిషేక్ జోడీని సాధారణంగా ‘ఐస్ అండ్ ఫైర్’ (ఒకరు కూల్, ఒకరు అగ్రెసివ్) అని పిలుస్తుంటారు. కానీ సంజూ దీనిని విభేదిస్తూ.. “మేము ఐస్ అండ్ ఫైర్ కాదు, ‘ఫైర్ అండ్ ఫైర్’ (మంటకు మంట). ఒకవేళ అతడు తగ్గితే నేను బాదుతాను, నేను తగ్గితే అతడు విరుచుకుపడతాడు. మా ఇద్దరి మధ్య కేరళ-పంజాబీ బంధం చాలా బలంగా ఉంది. క్రీజులో మా మధ్య కమ్యూనికేషన్ చాలా సింపుల్‌గా ఉంటుంది. బంతి ఎలా వస్తుందని అతడు అడిగితే.. ‘బానే వస్తోంది, సిక్సర్ కొట్టు’ అని నేను చెబుతాను. అంతా చాలా నేచురల్ గా జరిగిపోతుంది” అని వివరించారు.

అహ్మదాబాద్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్‌పై భారత్ 255 పరుగుల భారీ స్కోరు చేయడంలో ఈ జోడీ పాత్ర మరువలేనిది. పవర్ ప్లేలోనే 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి కివీస్ బౌలర్లను వణికించారు. ఈ మ్యాచ్‌లో సంజూ 89 పరుగులు చేయగా, అభిషేక్ కేవలం 21 బంతుల్లోనే 52 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ముగింపులో సంజూ సరదాగా ఒక సలహా ఇస్తూ.. “భాయ్.. ఇక నువ్వు త్వరగా పెళ్లి చేసేసుకో” అంటూ అభిషేక్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.

Related posts

ఇమ్రాన్ ఖాన్ కోసం కదిలిన క్రికెట్ ప్రపంచం…సరైన వైద్యం అందించాలని పాక్ ప్రధానికి లేఖ ..

Ram Narayana

తొక్కిసలాట ఘటన .. హైకోర్టును ఆశ్రయించిన కర్ణాటక క్రికెట్‌ సంఘం

Ram Narayana

పాకిస్థాన్ వెళ్లనున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ!

Ram Narayana