ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఫోన్‌లో సంభాషించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, వ్యూహాత్మకంగా కీలకమైన హార్ముజ్ జలసంధిని తెరిచి ఉంచాల్సిన ఆవశ్యకతపై ఇరువురు నేతలు ప్రధానంగా చర్చించుకున్నారు. ఈ విషయాన్ని భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ‘ఎక్స్’ ద్వారా ధృవీకరించారు.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతికి దారితీసిన ఫిబ్రవరి 28 దాడుల తర్వాత పశ్చిమాసియాలో సంక్షోభం తీవ్రమైంది. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన ఈ దాడులకు ప్రతిగా ఇరాన్.. ఆయా దేశాల స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు ఒత్తిడికి గురవుతుండగా, ఇంధన ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలో మోదీ, ట్రంప్ మధ్య ఫోన్ కాల్ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదిలా ఉండగా, ఒకరోజు ముందే భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఫోన్‌లో మాట్లాడుకున్నారు. పశ్చిమాసియా సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా ఇంధన భద్రతపై చూపుతున్న ప్రభావం గురించి చర్చించామని జైశంకర్ తెలిపారు. పరస్పర ప్రాధాన్యత కలిగిన అంశాలపై కలిసి పనిచేయాలని ఇరుపక్షాలు అంగీకరించినట్లు అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది భారత్‌లో జరగనున్న క్వాడ్ సదస్సు నేపథ్యంలో ట్రంప్ పర్యటించే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే.
ట్రంప్ ఫోన్ చేశారు.. శాంతి దిశగా చేపట్టే చర్యలకు భారత్ సహకరిస్తుందని చెప్పాను: మోదీ ట్వీట్
24-03-2026 Tue 20:52 | National
హర్మూజ్ జలసంధిని తెరిచి సురక్షితంగా, అందరికీ అందుబాటులో ఉండేలా చూడటం ప్రపంచం మొత్తానికి అత్యవసరమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు ఫోన్ చేసి సంభాషించినట్లు వెల్లడించారు. పశ్చిమాసియాలో పరిస్థితులపై ఉపయోగకరమైన రీతిలో తమ మధ్య చర్చ జరిగిందని తెలిపారు. ఈ అంశంపై పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలిపారు.
వీలైనంత త్వరగా ఉద్రిక్తతలను తగ్గించి, శాంతిని పునరుద్ధరించడానికి భారతదేశం మద్దతు ఇస్తుందని ట్రంప్‌కు చెప్పినట్లు పేర్కొన్నారు. హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడం, రక్షణ కల్పించడం ప్రపంచ దేశాలకు అత్యవసరమని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. శాంతి, సుస్థిరం దిశగా చేపట్టే అన్ని ప్రయత్నాలకు భారత్ అండగా నిలుస్తుందని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు.
ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య గత 24 రోజులుగా జరుగుతున్న యుద్ధానికి, ట్రంప్ నిన్న తాత్కాలిక విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. ఐదు రోజుల పాటు ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్‌తో తదుపరి చర్చల ఫలితాలను బట్టి నిర్ణయం ఉంటుందని అన్నారు. యుద్ధానికి తాత్కాలికంగా విరామం ప్రకటించిన మరుసటి రోజే ట్రంప్ ప్రధాని మోదీకి ఫోన్ కాల్ చేయడం గమనార్హం.