Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కోట్లాది రూపాయ‌ల ఆస్తులు వ‌దులుకుని.. క‌ట్టుబ‌ట్ట‌ల‌తో భార‌త్ కు వ‌చ్చిన ఆఫ్ఘ‌నిస్థాన్ కోటీశ్వ‌రుడు!

కోట్లాది రూపాయ‌ల ఆస్తులు వ‌దులుకుని.. క‌ట్టుబ‌ట్ట‌ల‌తో భార‌త్ కు వ‌చ్చిన ఆఫ్ఘ‌నిస్థాన్ కోటీశ్వ‌రుడు
-తాలిబ‌న్ల క‌ల‌కలంతో విదేశాల‌కు ఆఫ్ఘ‌న్లు
-ఢిల్లీకి వచ్చిన‌ ఇమ్రాన్ (28)
-అత‌డికి ఆ దేశంలో కోట్లాది రూపాయల విలువ చేసే భూములు, వ్యాపారాలు
-కాబుల్‌లోనే అతడి కుటుంబం

-కాబూల్‌లో చిక్కుకుపోయిన మంచిర్యాల వాసి.. కుటుంబం ఆందోళన
-8 సంవత్సరాలుగా కాబూల్‌లో పనిచేస్తున్న రాజన్న

ఆఫ్ఘ‌నిస్థాన్‌ నుంచి అమెరికా బలగాలు వెనక్కు వెళ్తున్న నేప‌థ్యంలో త‌మ ప‌రిస్థితి ఎలా ఉంటుందోన‌ని అక్క‌డి ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న చెందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆ దేశ ప్ర‌జ‌లు విదేశాల‌కు వలస వెళ్లిపోతున్నారు. క‌ష్ట‌ప‌డి సంపాదించుకున్న ఆస్తుల‌న్నీ వ‌దిలి క‌ట్టుబ‌ట్ట‌ల‌తో వారు దేశాన్ని విడిచి వెళ్తున్న తీరు క‌ల‌చివేస్తోంది.

ఇదే క్రమంలో ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఇమ్రాన్ (28) అనే యువకుడు భారత్‌కు వచ్చాడు. ఇమ్రాన్‌ ఆఫ్ఘ‌నిస్థాన్‌లో కోటీశ్వ‌రుడు. అత‌డికి ఆ దేశంలో కోట్లాది రూపాయల విలువ చేసే భూములు,
వ్యాపారాలు వున్నాయి. వాట‌న్నింటినీ ఆయ‌న వ‌దులు‌కుని ఢిల్లీకి రావాల్సి వ‌చ్చింది. అతనికి కాబుల్‌లో మూడు కోట్ల టర్న్‌ఓవర్ కలిగిన ఆటో స్పేర్‌పార్ట్స్ వ్యాపారం కూడా ఉంది.

అయితే, కోట్ల రూపాయ‌ల ఆస్తుల క‌న్నా ప్రాణ‌మే ముఖ్య‌మ‌ని ఆఫ్ఘ‌న్‌ను వ‌ద‌లివచ్చేశాడు. ఇప్పుడు ఆయ‌న ఢిల్లీలో నిరుపేద‌గా జీవనం కొన‌సాగిస్తున్నాడు. కాబుల్‌లోనే చిక్కుకుపోయిన‌ తన కుటుంబాన్ని కూడా ఢిల్లీకి తీసుకురావాలని ఇమ్రాన్ ప్రయత్నిస్తున్నాడు. ఇమ్రాన్ మాత్ర‌మే కాదు.. చాలా మంది త‌మ ఆస్తులు వ‌దులుకుని, విదేశాల‌కు వెళ్లి చిన్నపాటి ఉద్యోగం అయినా చేసుకుని బతకడానికి ప్ర‌య‌త్నిస్తున్నారు.

కాబూల్‌లో చిక్కుకుపోయిన మంచిర్యాల వాసి.. కుటుంబం ఆందోళన
8 సంవత్సరాలుగా కాబూల్‌లో పనిచేస్తున్న రాజన్న

తాలిబన్ల వశమై అల్లకల్లోలంగా మారిన ఆఫ్ఘనిస్థాన్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ వాసి గురించి ఆయన కుటుంబం తీవ్ర ఆందోళన చెందుతోంది. మంచిర్యాలకు చెందిన బొమ్మన రాజన్న ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని ఏసీసీఎల్ అనే సంస్థలో 8 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. జూన్ 28న స్వగ్రామానికి వచ్చిన రాజన్న ఈ నెల 7న తిరిగి కాబూల్ చేరుకున్నాడు. ప్రస్తుతం కాబూల్‌లో పరిస్థితులు దారుణంగా ఉండడంతో అక్కడి నుంచి బయటపడే దారి కనిపించక ఆందోళన చెందుతున్నాడు.

రాజన్నతోపాటు కరీంనగర్ జిల్లా ఒడ్డారానికి చెందిన వెంకన్న కూడా అక్కడే ఉన్నాడు. ఈ నెల 18న (నేడు) వీరిని ఇండియా పంపేందుకు సంస్థ టికెట్లు కూడా బుక్ చేసింది. అయితే, కాబూల్ నుంచి వాణిజ్య విమానాల సేవలు నిలిచిపోవడంతో వారు అక్కడే చిక్కుకుపోయారు. తమను సురక్షితంగా దేశం నుంచి తరలించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మరోవైపు, రాజన్న కుటుంబం కూడా తీవ్ర ఆందోళన చెందుతోంది. ఆయనను సురక్షితంగా స్వగ్రామం చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని వేడుకుంటోంది.

Related posts

ఖమ్మంలో ఎంపీలు నామ,వద్దిరాజు,ఎమ్మెల్సీ తాతా మధుల పర్యటన….

Drukpadam

ఏపీలో అవినీతికి చెక్..

Drukpadam

జగన్ ఢిల్లీ పర్యటనలో అనూహ్య మార్పు.. నిర్మలా సీతారామన్ తో భేటీ!

Drukpadam

Leave a Comment