
అమరావతి రాజధానికి చట్టబద్ధత లభించిన నేపథ్యంలో, ఆ ప్రాంత రైతులు, మహిళలు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ కాలినడకన భారీ యాత్ర చేపట్టారు. రాజధానిగా అమరావతికి చట్టపరమైన గుర్తింపు లభించడం, అభివృద్ధి పనులు వేగవంతం కావడంతో తమ ఇష్టదైవానికి మొక్కులు చెల్లించుకున్నారు.
అమరావతి పరిరక్షణ సమితి నాయకులు, స్థానిక నేతలు, పెద్ద సంఖ్యలో మహిళలు, రైతులు ఈ కాలినడక యాత్రలో పాల్గొన్నారు. కనకదుర్గమ్మ వారధి నుంచి ఇంద్రకీలాద్రి వరకు సాగిన ఈ యాత్ర ‘జై అమరావతి’ నినాదాలతో మార్మోగింది. మహిళలు సాంప్రదాయబద్ధంగా పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, చీర సారెను అమ్మవారికి భక్తిశ్రద్ధలతో సమర్పించారు.
అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అభివృద్ధి చేసే దిశగా అడుగులు పడుతుండటంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లుగా తాము పడ్డ కష్టానికి ఫలితం దక్కిందని, రాజధాని ప్రాంతం సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు. రాజధాని నిర్మాణం నిర్విఘ్నంగా పూర్తి కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: