విజయవాడలో కిషన్ రెడ్డి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు;ఏపీ ప్రభుత్వం బీజేపీ శ్రేణులను వేధిస్తోందని కిషన్ రెడ్డి మండిపాటు!
-తిరుపతి నుంచి గన్నవరం చేరుకున్న కిషన్ రెడ్డి
-ఎయిర్ పోర్టు నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు
-పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారంటూ బీజేపీ శ్రేణుల మండిపాటు
– సీఎం జగన్ ను కలిసిన కిషన్ రెడ్డి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ రోజు ఆయన తిరుపతి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి విజయవాడకు ఆయన ర్యాలీగా బయల్దేరారు. అయితే, ఎనికేపాడు వద్ద ఆయన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతులు లేవని పోలీసులు తేల్చి చెప్పారు.
ఈ క్రమంలో బీజేపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయినా పోలీసులు ఏమాత్రం తగ్గలేదు. కేవలం రెండు కార్లను మాత్రమే విజయవాడ వైపుకు అనుమతించారు. దీంతో, ఇతర కార్లు, బైకులన్నీ అక్కడే ఆగిపోయాయి. మరోవైపు పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని ఏపీ బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి.
కిషన్ రెడ్డి ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఉన్నారు. కిషన్ రెడ్డి తిరుపతి నుంచి జన ఆశీర్వాద యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ యాత్ర రెండు రోజుల పాటు ఏపీలో, మూడు రోజుల పాటు తెలంగాణలో కొనసాగనుంది. ఇందులో భాగంగా ఈరోజు ఆయన విజయవాడకు చేరుకున్నారు.
ఏపీ సర్కారుపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. ఆయన తిరుపతి నుంచి విజయవాడ చేరుకున్నారు. ఈ క్రమంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం బీజేపీ శ్రేణులను వేధిస్తోందని ఆరోపించారు. పార్లమెంటులో పనిచేయనీయకుండా తమను అడ్డుకున్నారని తెలిపారు. అందుకే ప్రజల్లోకి వచ్చి జన ఆశీర్వాద యాత్ర చేపట్టామని వివరించారు.
అనేక అంశాల్లో ఏపీకి ప్రాధాన్యత కింద నిధులు ఇచ్చామని వెల్లడించారు. ఏపీకి నిధుల విషయంలో కేంద్రంపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అసంతృప్తి వెలిబుచ్చారు. వ్యక్తులు, కుటుంబాల ఆధారంగా నడిచే పార్టీలను నమ్మవద్దని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కుటుంబ పార్టీలకు వ్యక్తిగత స్వార్థం తప్ప విశాల దృక్పథం ఉండదని విమర్శించారు. కాగా, కాసేపట్లో కిషన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కిషన్ రెడ్డి కలవడం గమనార్హం .