అంతర్జాతీయం

ఓపెన్‌ఏఐ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌ ఇంటిపై పెట్రోలు బాంబు దాడి…

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అగ్రగామి సంస్థ అయిన ఓపెన్‌ఏఐ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌ నివాసమే లక్ష్యంగా జరిగిన దాడి అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఆయన ఇంటిపై శుక్రవారం తెల్లవారుజామున సుమారు 4.12 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి మొలటోవ్‌ కాక్‌టెయిల్‌ (పెట్రోలు బాంబు) విసిరారు. 

ఈ దాడి ధాటికి ఇంటి ప్రధాన గేటు వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు ధ్రువీకరించారు. అయితే దాడి జరిగిన సమయంలో ఆల్ట్‌మన్‌ ఇంట్లోనే ఉన్నారా? లేదా? అన్న అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఈ దాడి జరిగిన కొద్దిసేపటికే ఓపెన్‌ఏఐ ప్రధాన కార్యాలయానికి కూడా నిప్పు పెడతామంటూ దుండగుల నుంచి బెదిరింపులు రావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి దర్యాప్తును ముమ్మరం చేశారు. సీసీటీవీ దృశ్యాలు, ఇతర సాక్ష్యాధారాల ఆధారంగా 20 ఏళ్ల ఒక యువకుడిని అనుమానితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఏఐ సాంకేతికతపై ఉన్న వ్యతిరేకతతో ఈ దాడికి పాల్పడ్డారా? లేక వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ సాగుతోంది. ఓపెన్‌ఏఐ ప్రతినిధులు కూడా ఈ దాడిని ధ్రువీకరిస్తూ, దర్యాప్తులో పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని వెల్లడించారు. నగర నడిబొడ్డున ఒక ప్రముఖ టెక్ దిగ్గజం ఇంటిపైనే ఇలాంటి దాడి జరగడం సిలికాన్ వ్యాలీలోని ప్రముఖులను భయాందోళనలకు గురిచేస్తోంది.

Related posts

ఐర్లాండ్ లో ఆరేళ్ల భారత సంతతి చిన్నారిపై జాతి వివక్ష దాడి…

Ram Narayana

న్యూయార్క్‌లో కాల్పుల మోత … ముగ్గురి మృతి…

Ram Narayana

నేపాల్ లో కొలువుదీరిన మధ్యంతర ప్రభుత్వం.. నూతన మంత్రివర్గాన్ని ప్రకటించిన ప్రధాని సుశీల

Ram Narayana