- ఇటీవలి హత్యలకు నిరసనగా మణిపూర్‌లో జంట బంద్‌లు
- లోయ, కొండ ప్రాంతాల్లో విద్యాసంస్థలు, మార్కెట్ల మూత
- చిన్నారుల హత్యపై మైరా పైబీల ఆందోళన
- భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురి మృతి
- పౌరుల కాన్వాయ్‌పై దాడికి నిరసనగా యునైటెడ్ నాగ కౌన్సిల్ బంద్
- ఘటనలపై ఎన్ఐఏ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
- కేంద్రం విఫలమైందని కాంగ్రెస్ విమర్శ
మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల జరిగిన వేర్వేరు హత్యలకు నిరసనగా రెండు ప్రధాన సంఘాలు పిలుపునిచ్చిన బంద్‌లతో సోమవారం రాష్ట్రంలోని లోయ, కొండ ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. విద్యాసంస్థలు, మార్కెట్లు, ప్రజా రవాణా సేవలు నిలిచిపోయాయి. ఇంఫాల్ లోయలోని పలు ప్రాంతాల్లో నిరసనకారులు ధర్నాలు నిర్వహించారు.
బిష్ణుపూర్ జిల్లాలో ఏప్రిల్ 7న జరిగిన బాంబు పేలుడు ఘటనలో నిద్రలో వున్న ఐదేళ్ల బాలుడు, ఆరు నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు నిరసనగా మహిళా సంఘం ‘మైరా పైబీలు’ ఐదు రోజుల ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ నిరసనల సందర్భంగా సీఆర్పీఎఫ్ క్యాంపుపై కొందరు దాడి చేయగా, భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు మరణించారు.
మరోవైపు, ఏప్రిల్ 18న ఉఖ్రుల్ జిల్లాలో పౌరుల కాన్వాయ్‌పై మిలిటెంట్లు జరిపిన దాడిలో మాజీ సైనికోద్యోగి సహా ఇద్దరు మృతి చెందారు. దీనికి నిరసనగా యునైటెడ్ నాగ కౌన్సిల్ (UNC) కొండ ప్రాంతాల్లో మూడు రోజుల సంపూర్ణ బంద్‌ను ప్రారంభించింది. ఈ రెండు ఘటనలతో రాష్ట్రంలో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ హింసాత్మక ఘటనలపై న్యాయవాదులు కూడా నిరసన తెలిపారు. బాధ్యులను పట్టుకోవడానికి కూంబింగ్ ఆపరేషన్లు ముమ్మరం చేయాలని, కాల్పుల ఘటనపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు కేసులను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించింది. శాంతిభద్రతల పునరుద్ధరణలో కేంద్రం విఫలమైందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. తక్షణమే చర్యలు చేపట్టి, బాధితులకు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేసింది.