అంతర్జాతీయం

హ‌ర్మూజ్ జలసంధిని తెరిచేందుకు మూడు షరతులు పెట్టిన ఇరాన్‌.. ససేమిరా అంటున్న అమెరికా

  • యుద్ధాన్ని ముగించి, హ‌ర్మూజ్‌ను తెరిచేందుకు అమెరికాకు టెహ్రాన్ కొత్త ప్రతిపాదన
  • నౌకా దిగ్బంధనం ఎత్తివేత, అణు చర్చల వాయిదా ప్రధాన డిమాండ్లు
  • అణు చర్చల వాయిదాను వ్యతిరేకిస్తున్న ట్రంప్, ప్రతిపాదనపై అసంతృప్తి
  • హ‌ర్మూజ్ మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి

అమెరికాతో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించుకుని, యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇరాన్ ముందుకు వచ్చింది. వ్యూహాత్మకంగా కీలకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరుస్తామని, అయితే అందుకు తమ షరతులను అంగీకరించాలని అమెరికాకు ప్రతిపాదించింది. ఈ మేరకు ఒమన్, పాకిస్థాన్ వంటి మధ్యవర్తుల ద్వారా టెహ్రాన్ తన ప్రణాళికను పంపింది. అయితే, ఇరాన్ పెట్టిన షరతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇరాన్ ప్రతిపాదన ఏంటి?
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి మధ్యవర్తిత్వ దేశాల ద్వారా అమెరికాకు మూడు షరతులతో కూడిన ప్రతిపాదనను పంపారు. వాటిలో ముఖ్యమైనవి: ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన నౌకా దిగ్బంధనాన్ని పూర్తిగా ఎత్తివేయాలి, ఇరాన్ అణు కార్యక్రమంపై జరగాల్సిన చర్చలను వాయిదా వేయాలి. ఈ రెండు ప్రధాన షరతులకు అంగీకరిస్తే హ‌ర్మూజ్ జలసంధిని వాణిజ్యానికి తెరిచి, యుద్ధ వాతావరణానికి తెరదించుతామని ఇరాన్ తెలిపింది.

అమెరికా ఎందుకు వ్యతిరేకిస్తోంది?
ఇరాన్ అణ్వాయుధాలను సొంతం చేసుకోకుండా నిరోధించడమే తన ప్రధాన లక్ష్యమని ట్రంప్ మొదటి నుంచి స్పష్టం చేస్తున్నారు. ఈ కారణంతోనే ఆయన యుద్ధానికి దిగారు. ఇప్పుడు ఇరాన్ ప్రతిపాదనలో అణు చర్చలను వాయిదా వేయాలన్న నిబంధన ఉండటమే ట్రంప్ అసంతృప్తికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దీనిపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా స్పందించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని మినహాయించి ఎలాంటి ఒప్పందాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. “ఏ ఒప్పందం జరిగినా, అది ఇరాన్‌ను అణ్వాయుధం వైపు వెళ్లకుండా కచ్చితంగా నిరోధించేలా ఉండాలి” అని ఆయన ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో అన్నారు.

ప్రపంచంపై తీవ్ర ప్రభావం
ప్రస్తుతం ఇరు దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ అమల్లో ఉంది. అయితే, ప్రపంచ వాణిజ్యంలో ఐదో వంతు చమురు, గ్యాస్ రవాణా అయ్యే హార్ముజ్ జలసంధి మూసివేత ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ కారణంగా అమెరికాలో మధ్యంతర ఎన్నికల ముందు పెట్రోల్, గ్యాస్ ధరలు ఆకాశాన్నంటాయి. ఇది ట్రంప్‌పై రాజకీయ ఒత్తిడిని పెంచుతోంది. మరోవైపు, అమెరికా మిత్రదేశాలైన గల్ఫ్ దేశాలు కూడా తమ ఎగుమతుల కోసం ఇదే మార్గాన్ని ఉపయోగిస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఈ దిగ్బంధనం వల్ల ఎరువులు, ఆహారం, ఇతర నిత్యావసరాల ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోవడంతో పలు దేశాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నప్పటికీ, ఇరుపక్షాలు తమ పంతాలు వీడకపోవడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది.

Related posts

పసిఫిక్ దీవి తువాలులో తొలి ఏటీఎం కేంద్రం

Ram Narayana

పహల్గామ్‌ దాడి తర్వాత పాక్ లో టెన్షన్.. సరిహద్దులకు యుద్ధ విమానాలు..!

Ram Narayana

ఏప్రిల్ 20న మార్షల్ లా వంటి ఆర్డర్‌ను జారీ చేయనున్న డొనాల్డ్ ట్రంప్!

Ram Narayana