సాయం కోరినా స్పందించని దేశాలు.. తాలిబన్లకు లొంగిపోనున్న అహ్మద్ మసూద్?
ఇన్నాళ్లూ తాలిబన్ల వశం కాకుండా పంజ్‌షీర్‌కు కాపలా కాసిన మసూద్
అంతర్జాతీయంగా అందని సహకారం
ఇప్పటికే ప్రావిన్స్‌ను చుట్టుముట్టిన తాలిబన్లు
రాజీ తప్ప మరో మార్గం లేదని యోచిస్తున్న అహ్మద్ షా
దేశం మొత్తం తాలిబన్ల వశమైనా పంజ్‌షీర్ ప్రావిన్స్‌లో అడుగుపెట్టకుండా అడ్డుకున్న ‘పంజ్‌షీర్ సింహం’ అహ్మద్ షా మసూద్ తాలిబన్లకు లొంగిపోయి ప్రావిన్స్‌ను వారి చేతుల్లో పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. పోరాటానికి తగిన వనరులు అందుబాటులో లేకపోవడం, సాయం కోరినా అంతర్జాతీయ సమాజం నుంచి స్పందన లేకపోవడంతో ఒంటరిగా మారిన 32 ఏళ్ల అహ్మద్ షా తాలిబన్లతో రాజీ కుదుర్చుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
తమ బలం చాలా తక్కువగా ఉందని, తాలిబన్లతో పోరాడడం ఇక అసాధ్యమని మసూద్ సలహాదారుడు ఒకరు ఓ వార్తా సంస్థతో చెప్పారు. 1980, 1990ల నాటి పరిస్థితులకు, తాజా పరిస్థితులకు మధ్య తేడా ఉందని, తాలిబన్ ఫైటర్లు ఇప్పుడు యుద్ధాల్లో పూర్తిగా ఆరితేరారని పేర్కొన్నారు. తాలిబన్లను ఎదురొడ్డుతున్న తమకు సాయం చేయాల్సిందిగా మసూద్ ఇటీవల ఫ్రాన్స్, అమెరికా, ఐరోపా, అరబ్ దేశాలను కోరినప్పటికీ ఆయా దేశాలేవీ స్పందించలేదు.
మరోవైపు, తాలిబన్లు ఇప్పటికే పంజ్‌షీర్‌ను చుట్టుముట్టారు. ఈ నేపథ్యంలో తాలిబన్లతో రాజీ కుదుర్చుకుని ప్రావిన్స్‌ను వారికి అప్పగించడం మినహా మరో దారి లేదని భావిస్తున్న మసూద్ లొంగిపోవడానికే నిర్ణయించుకున్నట్టు సమాచారం.
పంజ్ షీర్ తిరుగుబాటు దళాలతో తాలిబన్ల చర్చలు
సమావేశమైన 40 మంది తాలిబన్ నేతలు
ఇంకా తేలని చర్చల ఫలితం
అంజుమాన్ పాస్ నుంచి చొరబాటుకు తాలిబన్ల యత్నం
తిప్పికొట్టామన్న పంజ్ షీర్ బలగాలు
పంజ్ షీర్ తిరుగుబాటు దళాలతో తాలిబన్లు చర్చలు జరుపుతున్నారు. 40 మందితో కూడిన తాలిబన్ల బృందం వారితో సమావేశమైంది. అయితే, చర్చల ఫలితం ఏంటన్నది ఇంకా తేలలేదు. అయితే, తాలిబన్ల ముందు రెండే రెండు మార్గాలున్నాయని పంజ్ షీర్ తిరుగుబాటు దళాలు పేర్కొంటున్నాయి. ఖొరాసన్ ప్రజల విలువలను తాలిబన్లు అంగీకరించడమా? లేదా తిరుగుబాటును ఎదుర్కోవడమా? అన్న రెండు ఆప్షన్లే వారికి ఉన్నాయని ట్వీట్ చేసింది.
అయితే, ఇప్పటికే పంజ్ షీర్ లీడర్ అహ్మద్ మసూద్ గౌరవపూర్వకంగా లొంగిపోవాలనుకుంటున్నారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ చర్చలకు ప్రాధాన్యం సంతరించుకుంది. చర్చలు సానుకూలంగా సాగితే తిరుగుబాటు దళాలు దేనికైనా సిద్ధంగా ఉన్నాయని తనను తాను ఆఫ్ఘన్ దేశాధ్యక్షుడిగా ప్రకటించుకున్న అమ్రుల్లా సలేహ్ చెబుతున్నారు.
నిన్న తాలిబన్లు బదక్షిణ్ ప్రావిన్స్ కు ఆనుకుని ఉన్న అంజుమాన్ పాస్ గుండా పంజ్ షీర్ లోయలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని, తిరుగుబాటు దళాలు వారిని అడ్డుకున్నాయని పంజ్ షీర్ బలగాల్లో చేరిన ఆఫ్ఘనిస్థాన్ ఆర్మీ కమాండో వజీర్ అక్బర్ చెప్పారు. తాలిబన్లతో జరిగిన హోరాహోరీ పోరులో చాలా మంది చనిపోయారని ఆయన తెలిపారు. కాగా, ఇప్పటిదాకా తాలిబన్ల అధీనంలోలేని ఏకైక ప్రావిన్స్ పంజ్ షీర్ కావడం విశేషం. ఇప్పుడు దానినీ చర్చల ద్వారా వారు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.