- -యూపీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు
- -కారు దూసుకుపోయిన ఘటనలో నలుగురు రైతుల మృతి
- -బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంక
ఉత్తరప్రదేశ్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన రైతులపై నుంచి కారు దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు లక్నోలోని తన నివాసం నుంచి ఘటన జరిగిన లఖింపూర్ ఖేరీకి ప్రియాంక బయలుదేరారు. ఈ క్రమంలో ప్రియాంక ప్రయాణాన్ని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని… అందువల్ల అక్కడకు వెళ్లడానికి అనుమతి లేదని ప్రియాంకకు పోలీసులు తెలిపారు.
ఈ నేపథ్యంలో పోలీసులపై ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇంటి నుంచి బయటకురావడం నేరం కాదని అన్నారు. బాధిత కుటుంబాలను కలిసి వారి బాధను పంచుకోవడానికి వెళ్తున్నానని చెప్పారు. తాను తప్పు చేసి ఉంటే వారంట్ చూపించి కారును ఆపాలని అన్నారు. ఈ దేశం బీజేపీది కాదని… ఈ దేశం రైతులదని చెప్పారు. ఒకవేళ తనను బలవంతంగా పోలీసు కారులో ఎక్కిస్తే మీపై కిడ్నాప్ కేసు పెడతానని హెచ్చరించారు. ఈ క్రమంలో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.