ఢిల్లీ కోర్టులో కాల్పుల ఘటన నేపథ్యంలో న్యాయవాదులకు స్మార్ట్ కార్డులు!
- గత నెలలో ఢిల్లీ రోహిణి కోర్టులో కాల్పులు
- గ్యాంగ్ స్టర్ ను కాల్చి చంపిన దుండగులు
- దుండగులను మట్టుబెట్టిన పోలీసులు
- న్యాయస్థానాల్లో భద్రతపై ఆందోళన రేకెత్తించిన ఘటన
గత నెలలో ఢిల్లీలోని రోహిణి కోర్టులో చొరబడిన గ్యాంగ్ స్టర్లు పోలీసుల అదుపులో ఉన్న ప్రత్యర్థి గ్యాంగ్ స్టర్ అఖిల్ గోగీని హతమార్చడం తెలిసిందే. ఈ ఘటనలో దుండగులు హతమైనప్పటికీ న్యాయస్థానాల్లో భద్రతా లోపాలు తేటతెల్లమయ్యాయి. ఈ నేపథ్యంలో న్యాయవాదుల భద్రతను దృష్టిలో ఉంచుకుని స్మార్ట్ కార్డులు జారీ చేయాలని బార్ సంఘాలు ఢిల్లీ హైకోర్టును కోరాయి.
డిజిటల్ చిప్ కలిగివుండే స్మార్ట్ కార్డుల ద్వారానే కోర్టు లోపలికి ప్రవేశాలకు అనుమతించాలని న్యాయవాద సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. అప్పుడు ఇతరులు లోపలికి చొచ్చుకుని వచ్చే అవకాశం ఉండదని వారు అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు న్యాయవాదులకు ఇప్పటికే జారీ చేసిన కార్డుల తరహాలోనే ఈ స్మార్ట్ కార్డులు కూడా ఉండాలని వారు సూచించారు.
రోహిణి కోర్టులో జరిగిన ఘటన నేపథ్యంలో, న్యాయస్థానాల్లో భద్రతను కట్టుదిట్టం చేయడంపై ఢిల్లీ హైకోర్టు… న్యాయ వ్యవస్థకు చెందినవారు, ఢిల్లీ ప్రభుత్వం, వివిధ బార్ అసోసియేషన్ల నుంచి సలహాలు, సూచనలు కోరింది.