Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పునీత్ అంత్యక్రియలు రేపటికి వాయిదా – అమెరికానుంచి పెద్ద కుమార్తె రావడం ఆలశ్యం

పునీత్ అంత్యక్రియలు రేపటికి వాయిదా – అమెరికానుంచి పెద్ద కుమార్తె రావడం ఆలశ్యం
-పోటెత్తిన అభిమానులు : తరలి వస్తున్న ప్రముఖులు..!!
తరలిన టాలీవుడ్ అగ్రహీరోలు ….
-కన్నీరు మున్నీరు అవుతున్న అభిమానులు …దుఃఖ సాగరంలో సినీ ప్రపంచం

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు వాయిదా పడ్డాయి. ఈరోజు సాయంత్రమే పునీత్ అంత్యక్రియలు జరుగుతాయని తొలుత ముఖ్యమంత్రి బొమ్మై స్వయంగా ప్రకటించారు. పునీత్ భౌతిక కాయాన్ని తొలుత వారి ఇంటికి..అక్కడి నుంచి కంఠీరవ స్టేడియానికి తరలించారు. ప్రస్తుతం అక్కడే పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన అభిమానులు తమ హీరోకు నివాళి అర్పిస్తున్నారు. సెలెబ్రిటీలు సైతం పునీత్ రాజ్ కుమార్ పార్థీవదేహాన్ని చూసి అశ్రు నివాళి అర్పిస్తున్నారు. పునీత్ కుమార్తె ఈ సాయంత్రం బెంగుళూరు చేరుకోనున్నారు.

అమెరికా నుంచి పునీత్ పెద్ద కుమార్తె రావాల్సి ఉంది ఆమె సాయంత్రానికి ఢిల్లీ చేరుకున్నారు. అక్కడనుంచి బయలుదేరి నేరుగా బెంగుళూరు లోని కంఠీరవ స్టేడియానికి చేరుకుంటారు . ఆమె వచ్చిన తరువాత ఈ రోజే అంత్యక్రియలు జరపాలని తొలుత నిర్ణయం తీసుకున్నారు. అయితే, సాయంత్రం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో రేపు ఉదయం 9 గంటలకు పునీత్ తల్లి -దండ్రుల సమాధి వద్దే అంత్యక్రియలు చేయాలని నిర్ణయించారు. పునీత్ అన్న రాఘవేంద్ర రాజ్ కుమార్ తనయుడు వినయ్ రాజ్ కుమార్ రేపు పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికే పునీత్ కు నివాళి అర్పించారు. నందమూరి బాలకృష్ణ కన్నీటి పర్యంతమయ్యారు. ఆ కుటుంబంతో తన తండ్రి సమయం నాటి నుంచి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. హీరోగానే కాకుండా.. సేవా కార్యక్రమల్లోనూ పునీత్ ఆదర్శంగా నిలిచారంటూ కొనియాడారు. పునీత్ ఎప్పటికీ చిర స్థాయిగా నిలిచపోతారన్నారు. నిర్మాత సాయి కొర్రపాటి, ప్రభుదేవా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున సీనియర్ నరేష్, శివ బాలాజీ బెంగుళూరు చేరుకుని పునీత్ పార్థివ దేహానికి నివాళులర్పించారు.

బాలయ్య – తారక్ ఉద్వేగంతో కన్నీరు

హీరో రాణా.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సైతం నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. ఇక, ప్రముఖ తెలుగు హీరో… పునీత్ స్నేహితుడు అయిన జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. తన స్నేహితుడిని ఆ స్థితిలో చూసి..ఉబికి వస్తున్న కన్నీటిని అదుపు చేసుకున్నారు. పునీత్ సోదరుడు శివన్న సైతం తారక్ ను చూడగానే భావోద్వేగానికి గురయి..కన్నీరు పెట్టుకున్నారు. శివన్నకు తారక్ ధైర్యం చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి సైతం కాసేపట్లో పునీత్ కు నివాళి అర్పించనున్నారు. ఇక, కర్ణాటక నలు మూలల నుంచి పెద్ద సంఖ్యలో వస్తున్న అభిమానులతో కంఠీరవ స్టేడియం కిక్కిరిసిపోయింది. ముఖ్యమంత్రి బొమ్మై అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆదివారం ఉదయం అంత్యక్రియలు జరుగుతాయని ముఖ్యమంత్రి అధికారికంగా ప్రకటించారు.

 

Related posts

న‌వంబ‌ర్‌లో మునుగోడు ఉప ఎన్నిక‌: బీజేపీ నేత సునీల్ బ‌న్స‌ల్‌!

Drukpadam

కేసీఆర్ ,కేటీఆర్ ఎవరొచ్చి పోటీచేసిన విజయం నాదే :రాజగోపాల్ రెడ్డి !

Drukpadam

ఒక్క సెకనులో కరోనా టెస్ట్ … ఫ్లోరిడా వర్సిటీ సరికొత్త సాంకేతికత…

Drukpadam

Leave a Comment