పార్వతి అమ్మాళ్ కు రూ.10 లక్షలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసిన హీరో సూర్య!
-ఇటీవల సూర్య హీరోగా ‘జై భీమ్’ చిత్రం విడుదల
-అందరినీ ఆకట్టుకున్న చిన్నతల్లి పాత్ర
-పార్వతి అమ్మాళ్ జీవితమే చిన్నతల్లి పాత్రకు స్ఫూర్తి
-దయనీయంగా పార్వతి అమ్మాళ్ జీవితం
-పెద్దమనసుతో స్పందించిన సూర్య
సూర్య హీరోగా ఇటీవల విడుదలైన చిత్రం ‘జై భీమ్’. న్యాయవాది నుంచి న్యాయమూర్తిగా ఎదిగి న్యాయం కోసం పరితపించిన జస్టిస్ చంద్రు జీవితంలోని ఓ ఘట్టం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో రాజన్న, చిన్నతల్లి అనే పాత్రలు ఉంటాయి. రాజన్న లాకప్ లో మరణించగా, న్యాయం కోసం చిన్నతల్లి పోరాడుతుంది. రియల్ లైఫ్ లో ఇలాంటి పోరాటం చేసిన మహిళ పేరు పార్వతి అమ్మాళ్. చిన్నతల్లి పాత్రకు పార్వతి అమ్మాళ్ జీవితమే స్ఫూర్తి.
కాగా, పార్వతి అమ్మాళ్ దయనీయ పరిస్థితి తెలుసుకుని హీరో సూర్య పెద్ద మనసుతో సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఆమె పేరు మీద బ్యాంకులో రూ.10 లక్షలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేశారు. దానిపై నెల నెలా వచ్చే వడ్డీతో పార్వతి అమ్మాళ్ జీవనం కొనసాగించవచ్చన్నది సూర్య ఆలోచన. సూర్య నిర్ణయం పట్ల సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మనసున్న హీరో అంటూ కొనియాడుతున్నారు.
కాగా, పార్వతి అమ్మాళ్ కు ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు లారెన్స్ ఓ ఇల్లు నిర్మించి ఇస్తానని ఇంతకుముందే హామీ ఇచ్చారు.
జైభీమ్ సినిమా ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చింది. మారుమూల నివసించే అక్షరం ముక్కరాని అమాయక ప్రజలను పెత్తందార్లు ఏవిధంగా మోసం చేస్తున్నది వారిని వివిధ కేసుల్లో విరికించి జైళ్లలోనే మగ్గేవిధంగా చేస్తున్న విషయాలను అద్భుతంగా దృశ్య రూపంలో చూపించిన తీరు ఆకట్టుకున్నది . సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఈ చిత్రం ద్వారా చూపించిన ఆలోచింప చేసింది. వాస్తవంగా జరిగిన కథ ఆధారంగా ఈ చిత్రనిర్మాణం జరిపిన సూర్యను పలువురు అభినందిస్తున్నారు.