Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మోదీ సంచలన ప్రకటన… వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్న కేంద్రం

  • జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ
  • వ్యవసాయ చట్టాలపై ప్రజలకు నచ్చచెప్పేందుకు యత్నించామన్న మోదీ
  • వచ్చే పార్లమెంటు సమావేశాల్లో చట్టాలను వెనక్కి తీసుకుంటామని వ్యాఖ్య

భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు సంచలన ప్రకటన చేశారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వ్యవసాయ చట్టాలపై ప్రజలకు నచ్చచెప్పేందుకు ఎంతో ప్రయత్నించామని అన్నారు. ఈ చట్టాలను కొందరు సమర్థించగా, మరికొందరు వ్యతిరేకించారని తెలిపారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రైతుల నుంచి వ్యతిరేకత వచ్చిందని… వారి కోరిక మేరకు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని చెప్పారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ చట్టాలను ఉపసంహరించుకుంటామని చెప్పారు.

మరోవైపు… పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ తో పాటు ఉత్తర భారతంలో పలు రాష్ట్రాల్లో ఈ చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఢిల్లీ శివార్లలో పంజాబ్ రైతులు ఏడాదికి పైగా నిరవధికంగా ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు గురునానక్ జయంతి సందర్భంగా మోదీ కీలక ప్రకటన చేయడం గమనార్హం. అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ తో పాటు పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న తరుణంలో మోదీ నుంచి ప్రకటన వెలువడటం గమనించాల్సిన విషయం.

రైతులకు క్షమాపణ చెప్పిన మోదీ.. ఆయన ప్రసంగంలో కీలక అంశాలు!

  • నా ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో రైతుల కష్టాలన్నీ చూశాను
  • ప్రధాని అయిన తర్వాత రైతుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చాను
  • వ్యవసాయ చట్టాలపై రైతులను ఒప్పించలేకపోయాం
  • ఇందులో ఎవరినీ నిందించాల్సిన అవసరం లేదు
  • ఆందోళన విరమించి ఇళ్లకు వెళ్లాలని రైతులను కోరుతున్నా

అత్యంత వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు. కాసేపటి క్రితం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ చట్టాలను ఉపసంహరించుకుంటామని తెలిపారు. రైతులకు క్షమాపణ చెపుతున్నానని వ్యాఖ్యానించారు. ఆయన ప్రసంగంలోని హైలైట్స్ ఇవే…

“నా ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో రైతులు పడే అన్ని కష్టాలను చూశాను. మన దేశం నాకు ప్రధాని బాధ్యతలను అప్పగించిన తర్వాత రైతుల అభివృద్ధికి, ఉన్నతికి నేను అత్యంత ప్రాధాన్యతను ఇచ్చాను. రైతులకు 22 కోట్ల భూసార పరీక్ష కార్డులను ఇచ్చాం. దీని వల్ల పంట దిగుబడి పెరిగింది. ఒక లక్ష కోట్ల రూపాయలను రైతులకు పరిహారంగా చెల్లించాం. రైతులకు బీమా, పెన్షన్ ఇచ్చాం. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతుల అకౌంట్లలోకి నగదును నేరుగా బదిలీ చేశాం. వ్యవసాయ బడ్జెట్ ను ఐదు రెట్లు పెంచాం. రైతులకు తక్కువ ధరకే విత్తనాలు దొరికేలా కృషి చేస్తున్నాం.

గ్రామీణ మార్కెట్లకు సంబంధించి మౌలిక వసతులను బలోపేతం చేశాం. పంటకు కనీస మద్దతు ధరను కూడా పెంచాం. క్రాప్ లోన్ ను డబుల్ చేశాం. రైతుల సంక్షేమం కోసం ఎంత చేయాలో అంతా చేశాం. రైతన్నల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేశాం. చిన్న, సన్నకారు రైతులకు మేలు చేసేందుకే కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చాం.

రైతుల సంక్షేమానికి, ముఖ్యంగా చిన్న రైతుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. పూర్తి స్థాయిలో వారికి సేవ చేసేందుకు మేము నిబద్ధులమై ఉన్నాం. అయితే కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులను మేము ఒప్పించలేకపోయాం. ఈ చట్టాలపై వారికి అవగాహన కల్పించేందుకు ఎంతో చేశాం. అయితే రైతుల్లో ఒక వర్గం మాత్రం ఈ చట్టాలను వ్యతిరేకించింది. చట్టాలలో మార్పులు తీసుకొచ్చేందుకు కూడా సిద్ధమయ్యాం. వ్యవసాయ చట్టాల అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.

ఈ అంశంలో ఎవరినీ నిందించాల్సిన అవసరం లేదు. అందరికీ ఒకే విషయాన్ని స్పష్టంగా చెపుతున్నా… వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నాం. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో దీనిపై ప్రకటన చేసి… రాజ్యంగపరమైన ప్రక్రియను ప్రారంభిస్తాం. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులందరూ ఉద్యమాన్ని విరమించి… క్షేమంగా ఇళ్లకు తిరిగి వెళ్లాలని కోరుతున్నా. ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి” అంటూ ప్రధాని భావోద్వేగంతో ప్రసంగించారు.

Related posts

పక్కరాష్ట్రాల్లో పంచాయతీలు మనకెందుకు …జగన్ ,చంద్రబాబు తగాదాలపై కవిత స్పందన ..

Ram Narayana

Fenty Beauty Starlit Hyper-Glitz Lipstick in $upanova

Drukpadam

అప్పుల రాష్ట్రంగా తెలంగాణ…సీఎల్పీ నేత భట్టి ధ్వజం

Drukpadam

Leave a Comment