- చట్టాల ఉపసంహరణ కేవలం ఇంటర్వెల్ మాత్రమే
- ఇది అమరావతి రైతులు సాధించిన విజయం కాదు
- సాంకేతిక సమస్యలను అధిగమించేందుకే హైకోర్టులో అఫిడవిట్ వేశాం
మూడు రాజధానుల చట్టాన్ని ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. కాసేపట్లో సీఎం జగన్ దీనిపై అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు. మరోవైపు ఈ అంశంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టాల ఉపసంహరణ కేవలం ఇంటర్వెల్ మాత్రమేనని… శుభం కార్డు పడేందుకు మరింత సమయం ఉందని చెప్పారు.
ఇది అమరావతి రైతులు సాధించిన విజయం కాదని… అమరావతి రైతుల పాదయాత్ర పెయిడ్ ఆర్టిస్టుల పాదయాత్ర అని ఎద్దేవా చేశారు. రైతుల పాదయాత్రలో ఏమైనా లక్షల మంది పాల్గొంటున్నారా? అని ప్రశ్నించారు. వారిని చూసి చట్టాలను ఉపసంహరించుకోలేదని అన్నారు. సాంకేతిక సమస్యలను అధిగమించడానికే హైకోర్టులో అఫిడవిట్ వేసినట్టు చెప్పారు. అమరావతి రాజధానిని తాను స్వాగతించనని… మూడు రాజధానులకే తన మద్దతని అన్నారు. చిత్తూరు జిల్లా రాయలచెరువులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.