తుఫాన్ గా మారిన వాయిగుండం ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు!
-ఒడిశా గోపాల్‌పూర్‌కు 530 కి.మీల దూరంలో ‘జవాద్’ తుపాను
-విశాఖకు ఆగ్నేయంగా 420 కి.మీల దూరంలో..
-ఉత్తర కోస్తా తీరంలో 80 నుంచి 90 కి.మీల వేగంతో ఈదురు గాలులు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. విశాఖకు ఆగ్నేయంగా 420 కి.మీల దూరంలో.. ఒడిశా గోపాల్‌పూర్‌కు 530 కి.మీల దూరంలో ‘జవాద్’ తుపాను కేంద్రీకృతమైంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. గంటకు 25 కి.మీల వేగంతో తీరం వైపు కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ఉదయానికి ఉత్తర కోస్తాంధ్రకు దగ్గరగా వచ్చే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. తీరానికి దగ్గరయ్యే కొద్దీ గాలుల తీవ్రత పెరగనుందని, అలా వచ్చే కొద్దీ దిశ మార్చుకొని పూరీ వైపు వెళ్లే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తర కోస్తా తీరంలో 80 నుంచి 90 కి.మీల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఈ తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు హెచ్చరించారు. పలు చోట్ల 20 సెం.మీలకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపారు. తుపాను వల్ల 3.5మీటర్ల ఎత్తున సముద్రపు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. ఉత్తర కోస్తాంధ్రలో అన్ని పోర్టులకు అధికారులు హెచ్చరికలు జారీచేశారు