Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఒకే రాష్ట్రం ఒకే రాజధాని: అదే అమరావతి అది ప్రజా రాజధాని … తిరుపతి సభలో చంద్రబాబు! నినాదం….

ఒకే రాష్ట్రం ఒకే రాజధాని: అదే అమరావతి అది ప్రజా రాజధాని … తిరుపతి సభలో చంద్రబాబు! నినాదం….
-తిరుపతిలో రైతుల సభ
-హాజరైన చంద్రబాబు
-సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు
-రైతులు చేసిన పాపమేంటి? అంటూ ఆగ్రహావేశాలు
-ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ నినాదాలు

మహా పాదయాత్ర ముగించిన రైతులు తిరుపతిలో ఏర్పాటు చేసిన మహోద్యమ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రానికి ఒకే రాజధాని అదే అమరావతి అది ప్రజాధాని అంటూ జై అమరావతి… జై జై అమరావతి అంటూ చంద్రబాబు ప్రసంగం ప్రారంభించారు. 45 రోజుల పాటు 450 కిలోమీటర్లు కాలినడకన రైతులు పాదయాత్ర చేశారని వెల్లడించారు. పాదయాత్రలో 100 కేసులు పెట్టారని ఆరోపించారు. ఈ రైతులు చేసిన పాపమేంటి? వారిపై అక్రమ కేసులు పెట్టిన దద్దమ్మ ప్రభుత్వం ఈ జగన్ ప్రభుత్వం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

నాడు అమరావతిని రాజధానిగా చేసేందుకు నిర్ణయించి భూములు ఇవ్వాలని రైతులను కోరితే వారు వెంటనే స్పందించారని వెల్లడించారు. తన వద్ద నిధులు లేకపోయినా హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన అనుభవం ఉందని చెప్పానని, రైతులు ముందుకొచ్చి భూములను త్యాగం చేశారని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన నేతలు కూడా ఇవాళ సభావేదికపై ఉన్నారని వివరించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అమరావతి రాజధానికి మద్దతు ప్రకటించారని ప్రస్తావించారు. సీపీఐ నారాయణ, రామకృష్ణ మొదటి నుంచి రైతులకు సంఘీభావం ప్రకటిస్తున్నారని వివరించారు.

“జగన్ మోహన్ రెడ్డి గారూ మీరు ఎన్నికలకు ముందు ఏంచెప్పారు? నాడు అసెంబ్లీలో ఏం చెప్పారు? అమరావతినే రాజధానిగా పెట్టాలని మీరు చెప్పలేదా? మనకు 13 జిల్లాలే ఉన్నాయని, చిన్న రాష్ట్రం అయిందని, ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెట్టడం తనకు ఇష్టంలేదని, అయితే కనీసం 30 వేల ఎకరాలన్నా రాజధానికి ఉండాలని మీరు ఆనాడు చెప్పలేదా? ఇవాళ 33 వేల ఎకరాలు రైతులు ఇచ్చారు. మడమ తిప్పను, మాట తప్పను అనే జగన్ రెడ్డిని ఇప్పుడు అడుగుతున్నా. అమరావతిపై మాట తప్పారా లేదా, మడమ తిప్పారా లేదా?

అమరావతిపై కుల ముద్ర వేసే పరిస్థితికి వచ్చారు. ఇవాళ సభకు అన్ని పార్టీల వారు వచ్చారు… వీరంతా ఏ కులం వాళ్లు? ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని అమరావతి రాజధాని కావాలని కోరుతున్నారు. 5 కోట్ల మందికి చెందిన ప్రజా రాజధాని ఇది. ఇది ఏ ఒక్కరిదో, జగన్ రెడ్డిదో కాదు… ప్రజలు కోరుకున్న రాజధాని. అలాంటి రాజధానిపై ఇష్టానుసారం వ్యవహరిస్తూ మూడు ముక్కలాట ఆడతారా? ఏమనుకుంటున్నారు మీరు?” అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

“అమరావతి ముంపు ప్రాంతం అన్నారు… ఈ మూడేళ్లలో ఒక్కసారైనా మునిగిపోయిందా? ఇన్ సైడర్ ట్రేడింగ్ అన్నారు… చివరికి ఇలాంటివేవీ లేవని హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా చెప్పాయి. వెంకటేశ్వరస్వామి సాక్షిగా చెబుతున్నా… నువ్వెన్నయినా కేసులు పెట్టుకో… కానీ మేం ధర్మపోరాటం చేస్తున్నాం. ధర్మపోరాటంలో గెలిచేది అమరావతి ప్రజలే. అమరావతి రైతులు ఐదు కోట్ల ఆంధ్రుల కోసం పోరాడుతున్నారు” అంటూ స్పష్టం చేశారు.

“నాడు హైదరాబాద్ ను అభివృద్ధి చేశాం, సైబరాబాద్ ను ఏర్పాటు చేశాం. ఏం, హైదరాబాద్ నాకోసం అభివృద్ధి చేసుకున్నానా? ఏపీలోనూ అమరావతిని అదే స్థాయిలో అభివృద్ధి చేయాలనుకున్నాం. రాష్ట్రంలో ఎక్కడ్నించి చూసినా మధ్యలో ఉండే ప్రదేశం అమరావతి. ఎక్కడ్నించైనా సులభంగా చేరుకోగలిగే ప్రాంతం. నువ్వు ఇంట్లో కూర్చున్నా సరే, అమరావతిని చెడగొట్టకుండా, ధ్వంసం చేయకుండా ఉంటే చాలు… అమరావతి అద్భుతరీతిలో అభివృద్ధి చెందుతుంది” అంటూ సీఎం జగన్ కు హితవు పలికారు.

ప్రసంగం ముగిస్తూ ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ నినాదాలు చేశారు. అభివృద్ధి అన్ని ప్రాంతాల్లోనూ జరగాలని, రాజధాని మాత్రం అమరావతి మాత్రమే ఉండాలని చంద్రబాబు ఉద్ఘాటించారు.

స్వాతంత్రం వచ్చాక రాజధాని లేని రాష్ట్రం మనదే!: సీపీఐ నారాయణ ..

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తిరుపతిలో రైతుల సభకు హాజరయ్యారు. ఏపీ రాజధాని అంశంలో సీఎం జగన్ పై ఆయన తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు. ఉత్తర భారతదేశానికి వెళితే మీ రాష్ట్రానికి రాజధాని ఏదని అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. రాజధాని ఏదంటే చెప్పలేక తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థంకావడంలేదని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక రాజధాని లేని రాష్ట్రం మనదేనని విమర్శించారు.

అమరావతిని రాజధానిగా చేస్తున్నామంటేనే రైతులు భూములు ఇచ్చారని నారాయణ వెల్లడించారు. కానీ అమరావతి అనే శిశువును జగన్ మూడు ముక్కలు చేశారని మండిపడ్డారు. మూర్ఖత్వంలో జగన్ ను మించినవారు మరొకరు ఉండరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళల కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని హితవు పలికారు. రాజధానిపై అంశంపై సీపీఐ మొదటి నుంచి ఒకే మాట చెబుతోందని, తాము ఇప్పటివరకు మాట మార్చలేదని నారాయణ ఉద్ఘాటించారు.

అమరావతి సభకు హాజరైన రఘురాజు

తిరుపతిలో అమరావతి రైతులు చేపట్టిన సభకు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు హాజరయ్యారు. రేణిగుంట విమానాశ్రయంలో ఆయనకు అమరావతి రైతులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది రాజకీయ సభ కాదని, దగాపడ్డ రైతుల సభ అని చెప్పారు. రైతులకు మద్దతుగా అన్ని వర్గాలు తరలి వస్తున్నాయని అన్నారు. వంద శాతం అమరావతే రాజధానిగా ఉంటుందని చెప్పారు. అమరావతే శాశ్వతమని, అడ్డుపడే మేఘాలు అశాశ్వతమని అన్నారు.

మోదీ, అమిత్ షా చెబితే కాదనే దమ్ము జగన్ కు ఉందా?: సీపీఐ రామకృష్ణ

తిరుపతిలో రైతుల మహోద్యమ సభకు హాజరైన సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ప్రసంగించారు. వైసీపీ తప్ప మిగతా పార్టీలన్నీ అమరావతినే రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. రాజధాని అంశంలో జగన్ రెండేళ్లుగా నిప్పుల కుంపటి రాజేశారని విమర్శించారు. తాను తిరుపతి సభకు వస్తుంటే అడ్డుకున్నారని రామకృష్ణ ఆరోపించారు. అటు అమరావతి ఉద్యమాన్ని అడ్డుకునేందుకు తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. అనేకమందిని జైళ్లలో తోశారని పేర్కొన్నారు.

తిరుపతిలో రాజధాని రైతుల సభకు ఎవరెవరు వచ్చారంటే..!

అమరావతి ఒక్కటే ఏపీ రాజధాని అంటూ న్యాయస్థానం టు దేవస్థానం పేరిట మహాపాదయాత్ర నిర్వహించిన రైతులు నేడు తిరుపతిలో భారీ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు సీపీఎం నేతలు తప్ప మిగిలిన అన్ని విపక్షాల నేతలు హాజరవుతున్నారు.

ఇప్పటివరకు ఈ సభకు విచ్చేసినవారిలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ, వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, పరిటాల సునీత, గౌతు శిరీష, సినీ నటుడు శివాజీ, పాతూరి నాగభూషణం, బీజేపీ, జనసేన ప్రతినిధులు ఉన్నారు.

Related posts

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కన్ఫ్యూజన్ లో ఉన్నారా ? కన్ఫ్యూజన్ చేస్తున్నారా ??

Drukpadam

ఇంద్రవెల్లి సభతో కేసీఆర్‌కు పోడు భూముల సమస్య గుర్తొచ్చింది: సీతక్క…

Drukpadam

అవినీతికి వ్యతిరేకంగానే మా పోరాటం: కర్ణాటక సీఎం బొమ్మై!

Drukpadam

Leave a Comment