బ్రిటన్‌లో మొదలైన ఒమిక్రాన్ ఆధిపత్యం.. రికార్డు స్థాయిలో ఒకే రోజు 93 వేలకుపైగా కేసులు
- వరుసగా మూడో రోజు రికార్డుస్థాయిలో కేసులు
- తాను హెచ్చరించిన సునామీ తాకడం మొదలైందన్న స్కాంట్లాండ్ ఫస్ట్ మినిస్టర్
- శరవేగంగా జరుగుతున్న బూస్టర్ డ్రైవ్
ఇంగ్లండ్‌లో కరోనా వైరస్ మరోమారు చెలరేగిపోతోంది. నిన్న అక్కడ రికార్డు స్థాయిలో కేసులు వెలుగు చూశాయి. శుక్రవారం 24 గంటల వ్యవధిలో 93,045 కేసులు నమోదైనట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇది వరుసగా మూడోసారి. కేసుల సంఖ్య పెద్ద ఎత్తున పెరగడానికి ఒమిక్రాన్ వేరియంటే కారణమని భావిస్తున్నారు.
తాజా కేసులతో కలుపుకుని దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 11.1 మిలియన్లకు చేరుకుంది. అలాగే, నిన్న 111 మంది కరోనాతో చనిపోయారు. ఫలితంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,47,000 పెరిగింది.
స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్ నికోలా స్టర్జన్ మాట్లాడుతూ.. దేశంలో ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ ఆధిపత్యం ప్రద్శిస్తోందని అన్నారు. వారం రోజుల క్రితం తాను హెచ్చరించిన సునామీ ఇప్పుడు తాకడం మొదలైందన్నారు. వెల్ష్ నేత మార్క్ డ్రేక్‌ఫోర్డ్ మాట్లాడుతూ.. డిసెంబరు 26 తర్వాత దేశంలోని నైట్‌క్లబ్‌లు మూసివేస్తామని, దుకాణాలు, కార్యాలయాల్లో సామాజిక దూరాన్ని తిరిగి ప్రవేశపెడతామన్నారు.
దేశంలో ప్రస్తుతం బూస్టర్ డ్రైవ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ ఏడాది చివరి నాటికి వీలైనంతమందికి బూస్టర్ డోసు వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాని బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ.. యూరప్‌లోనే అత్యంత వేగంగా మన దగ్గర వ్యాక్సినేషన్ కార్యక్రమం నడుస్తోందన్నారు. అంతేకాకుండా ఒమిక్రాన్ కారణంగా ఉత్పన్నమయ్యే హానికారక పరిణామాలను నివారించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు.