భద్రాచలం: కరోనా(ఒమైక్రాన్) థర్డ్‌వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రి వైకుంఠ ఏకాదశి మహోత్సవాలను అంతరంగికంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అనుదీప్ తెలిపారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 12వ తేదీన స్వామివారి తెప్పోత్సవం, 13న నిర్వహించే ఉత్తరద్వార దర్శనాలకు భక్తులను అనుమతి లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. బుధవారం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ కొవిడ్ మూడోదశ వ్యాప్తి నేపథ్యంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు భక్తులకు అనుమతి లేదని తెలిపారు. సంప్రదాయం ప్రకారం కేవలం కొద్దిమంది అర్చకులు, వేద పండితులు, సిబ్బంది సమక్షంలో అంతరంగికంగా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించి తెప్పోత్సవం, ఉత్తరద్వార దర్శనానికి భద్రాచలం రావొద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు