జగన్ తో చిరంజీవి కీలక భేటీ …పరిస్కారం దిశగా సినీ పరిశ్రమ సమస్యలు…
జగన్ తో భేటీ వివరాలను వెల్లడించిన చిరంజీవి
సినీ పరిశ్రమ సమస్యలను సీఎం అర్థం చేసుకున్నారని వెల్లడి
నన్ను ఓ సోదరుడిలా భావించి ఆత్మీయంగా మాట్లాడారు
సినిమా టికెట్ రేట్ల జీవోపై ఆలోచిస్తామన్నారు
అన్నింటికీ జగన్ సానుకూలంగా స్పందించారు
పరిశ్రమలో ఎవరూ నోరు జారొద్దంటూ హితవు
మరోసారి సమావేశం కావాలని వీరివురి అభిప్రాయం
ప్రభుత్వానికి , సినీపరిశ్రమకు మధ్య దూరం తగ్గించేవిధంగా చర్యలు
సినీ రంగ సమస్యలపై ఏపీ సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి దాదాపు గంటన్నర పాటు చర్చించారు. ఇరువురి భేటీ కొద్దిసేపటి కిందట ముగిసింది. సినీ పరిశ్రమ సమస్యలను చిరంజీవి సీఎం జగన్ కు వివరించారు. సినిమా టికెట్ల ధరలు పెంచాలని కోరారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. కరోనా సంక్షోభం కారణంగా సినీ కార్మికులు కష్టాల్లో ఉన్నారన్న విషయాన్ని చిరంజీవి ఏపీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సినీ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు.
కాగా, చిరంజీవి ప్రస్తావించిన అన్ని అంశాలను సీఎం జగన్ నోట్ చేసుకున్నారు. మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. చిత్ర పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య దూరం తగ్గించే విధంగా చర్చలు, చర్యలు ఉండాలని అభిప్రాయపడ్డారు.
ఏపీ సీఎం జగన్ తనను ఓ సోదరుడిలా భావించి ఆత్మీయంగా మాట్లాడారని చిరంజీవి అన్నారు. సినిమా టికెట్ల ధరల విషయంపై ఇవాళ జగన్ తో భేటీ అనంతరం హైదరాబాద్ కు తిరిగి వెళుతూ గన్నవరం విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సినీ పరిశ్రమలో ఉన్న సాధకబాధకాలన్నింటినీ జగన్ కు వివరించానని చెప్పారు. సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై ఇచ్చిన జీవోపై మరోసారి ఆలోచిస్తామంటూ జగన్ చెప్పారని, అది చాలా శుభవార్త అని చిరంజీవి అన్నారు.
కొన్నాళ్లుగా జటిలమవుతున్న సమస్యను పరిష్కరించేందుకు రెండో వైపున అభిప్రాయాలను వినేందుకూ జగన్ సుముఖంగా ఉన్నారన్నారు. వినోదం అందరికీ అందుబాటులో ఉండాలన్న సీఎం జగన్ ప్రయత్నాన్ని అభినందిస్తున్నానని చెప్పిన ఆయన.. సీఎంకు థియేటర్ల యజమానులు, సినీ పరిశ్రమ కార్మికులు పడుతున్న ఇబ్బందులను వివరించానని తెలిపారు. థియేటర్లు మూసేసుకోవాల్సి వస్తుందన్న భయంలో యజమానులున్నారని, కాబట్టి నిర్మాణాత్మకమైన సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని సీఎంకు చెప్పానని చిరంజీవి తెలిపారు.
సినీ పరిశ్రమ సమస్యలను ఆయన అర్థం చేసుకున్నారన్నారు. అన్నింటికీ ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటానంటూ జగన్ హామీ ఇచ్చారన్నారు. దీనిపై కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందంటూ జగన్ ఎంతో భరోసానిస్తూ మాట్లాడారని తెలిపారు. చిన్న సినిమాలకు ఐదో షోపైనా సీఎం సానుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు. ఆయన మాటలపై తనకు ఎంతో నమ్మకం ఏర్పడిందన్నారు.
ఎవరూ అభద్రతా భావంతో ఉండకూడదని చిరంజీవి స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారంపై అతి త్వరలోనే ముసాయిదానే తయారు చేసుకుంటామని వెల్లడించారు. దీనిపై సినీ పరిశ్రమలోని పెద్దలతో మాట్లాడుతామని తెలిపారు. ‘సినీ పరిశ్రమకు చెందినవారెవరైనా ఏవేవో ఊహించుకుని నోరు జారకూడదని ఇండస్ట్రీ పెద్దగా కాదు.. బిడ్డగా విజ్ఞప్తి చేస్తున్నా’ అని అన్నారు. సినీ పరిశ్రమ బాగు కోరుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్న నమ్మకం తనకుందని, కాబట్టి తన మాటలను మన్నించి అందరూ సంయమనం పాటించాలని సూచించారు.