సీఎల్పీ సమావేశం నుంచి అర్ధంతరంగా బయటికి వచ్చేసిన జగ్గారెడ్డి
- రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బట్జెడ్ సమావేశాలు
- హైదరాబాదులో సీఎల్పీ సమావేశం
- భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో భేటీ
- రేవంత్ విషయం ప్రస్తావించేందుకు జగ్గారెడ్డి యత్నం
- వారించిన భట్టి, కుసుమకుమార్
- అందుకే బాయ్ కాట్ చేశానన్న జగ్గారెడ్డి
రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు సీఎల్పీ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ సభాపక్ష నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో హైదరాబాద్ తాజ్ డెక్కన్ హోటల్ లో ఈ భేటీ జరిగింది. అయితే, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమావేశంలో మధ్యలోనే బయటికి వచ్చేశారు.
దీనిపై ఆయన మాట్లాడుతూ, తనకు గతంలోనే అనేక అవమానకర పరిస్థితులు ఎదురయ్యాయని, ఇప్పుడూ అదే తీరులో పరిస్థితులు ఉన్నాయని వెల్లడించారు. అందుకే సీఎల్పీ భేటీని బాయ్ కాట్ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. వాస్తవానికి జగ్గారెడ్డి సీఎల్పీ భేటీకి ముందే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, పార్టీ అంతర్గత విషయాలు ప్రెస్ మీట్లో మాట్లాడొద్దని భట్టి, తదితరులు సూచించడంతో జగ్గారెడ్డి మీడియా సమావేశాన్ని నిలిపివేశారు.
సీఎల్పీ సమావేశాన్ని బహిష్కరించాక మళ్లీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి మెదక్ పర్యటన విషయం తనకు తెలియదని, రేవంత్ రెడ్డి ప్రోటోకాల్ పాటించడంలేదని జగ్గారెడ్డి ఆరోపించారు. ఈ అంశాలను సీఎల్పీలో మాట్లాడేందుకు ప్రయత్నించానని, అయితే భట్టి, కుసుమకుమార్ ఈ అంశాలు మాట్లాడొద్దన్నారని వెల్లడించారు. అందుకే సీఎల్పీ భేటీ నుంచి బయటికి వచ్చేశానని వివరించారు .