చాక్లెట్లు తిని చిన్నారుల మృత్యువాత.. యూపీలో ఘోరం!
- ఓ ఇంటి ముందు ప్లాస్టిక్ బ్యాగ్, అందులో ఐదు చాక్లెట్లు
- చాక్లెట్లను పిల్లలకు ఇచ్చిన ఓ మహిళ
- వాటిని తిన్నంతనే స్పృహ కోల్పోయిన చిన్నారులు
- ఆసుపత్రికి తరలించేలోగానే మృతి
- మృతుల్లో ముగ్గురు తోబుట్టువులు
ఉత్తరప్రదేశ్‌లో బుధవారం ఓ ఘోరం చోటుచేసుకుంది. చాక్లెట్లు తిన్న నలుగురు చిన్నారులు ఆ వెంటనే మృత్యువాత పడ్డారు. యూపీలోని ఖుషీ నగర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనలో పిల్లలు తిన్న చాక్లెట్లు.. ఓ మహిళకు తన ఇంటి ముందు దొరికిన బ్యాగులో కనిపించాయి. దీంతో ఆ చాక్లెట్లలో విష పదార్ధాలేమైనా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ఖుషీనగర్ జిల్లా కాశ్య ప్రాంతంలోని దిలీప్ నగర్‌లో ఉన్న ఓ ఇంటి ముందు ప్లాస్టిక్ బ్యాగ్ దొరికింది. ఓ మహిళ ఆ బ్యాగ్‌ను తెరిచి చూడగా అందులో ఐదు చాక్లెట్లు, కొన్ని నాణేలు ఉన్నాయి. ఆ చాక్లెట్లను ఆమె తన ముగ్గురు మనవళ్లు, పక్కింట్లో నివసిస్తున్న మరో చిన్నారికి ఇచ్చింది. ఆ చాక్లెట్లు తిన్న కాసేపటికే పిల్లలు స్పృహ కోల్పోయారు. దీంతో చిన్నారులను వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే వారు చనిపోయారు. మృతులను మంజన (3), స్వీటీ (3), సమర్ (2), అరుణ్ (5)గా గుర్తించారు. వీరిలో మంజన, స్వీటీ, సమర్ తోబుట్టువులుగా పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పిల్లలు తిన్న చాక్లెట్‌ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు ఖుషీనగర్ జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని అధికారులకు సూచించారు.