Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

నా వెనుకాల కొండను చూసుకుని విర్రవీగాను… రోడ్డున పడ్డాను: సినీ నటుడు పృథ్వీరాజ్

నా వెనుకాల కొండను చూసుకుని విర్రవీగాను… రోడ్డున పడ్డాను: సినీ నటుడు పృథ్వీరాజ్

  • 2019 ఎన్నికల్లో వైసీపీకి ప్రచారం చేసిన పృథ్వీ
  • ఎస్వీబీసీ చైర్మన్ గా నియామకం
  • మహిళతో సంభాషణ టేప్ కలకలం
  • పదవిని పోగొట్టుకున్న పృథ్వీ
  • సినిమారంగంలో తగ్గిన అవకాశాలు

టాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ కామెడీలో తిరుగులేని టైమింగ్ తో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. రాజకీయ రంగంలోనూ స్వల్పకాలంలోనే ఉవ్వెత్తున ఎగిసిన ఆయన, అంతే త్వరగా వెనుకపడిపోయారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత పృథ్వీరాజ్ కు ఎస్వీబీసీ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. కానీ ఓ మహిళతో పృథ్వీరాజ్ అనుచితంగా మాట్లాడినట్టు ప్రచారమైన ఒక ఆడియో టేప్ ఆయన జీవితాన్ని మార్చివేసింది. ఎస్వీబీసీ పదవి పోయింది… రాజకీయ జీవితం కూడా సంక్షోభంలో పడింది. సినిమా రంగంలోనూ పాతాళానికి పడిపోయారు.

ఈ నేపథ్యంలో, పృథ్వీరాజ్ తాజాగా మీడియాలో తన మనోభావాలను పంచుకున్నారు. అది ఆయన మాటల్లోనే….

“చాలా రోజులుగా మనసు విప్పి మాట్లాడాలని, ప్రజలందరికీ చేరువ కావాలని మథనపడుతున్నాను. నిద్రలేని రాత్రులెన్నో గడిపాను. ఆర్థికంగా చాలా నష్టపోయాను, సినిమాల పరంగా బాగా దెబ్బతిన్నాను. ఇంతకుముందులా పలు బ్యానర్లు, హీరోలు నన్ను ఎంకరేజ్ చేయడంలేదు… ఇది వాస్తవం.

ఎందుకంటే నాలాంటి వాడికి రాజకీయాలు పడవు. ముక్కుసూటిగా మాట్లాడడమే అందుకు కారణం అనుకుంటా. రాజకీయాల్లోకి వచ్చాక పదవి రావడం దేవుడిచ్చిన ఓ వరం అనుకుని సంతోషించాను కానీ, వెనుక ఎంతోమంది ఏడ్చారని అర్థమైంది. పదవిలో ఉన్నప్పుడు నిజంగానే చాలా కష్టపడి పనిచేశాను. కానీ జరిగిన పరిణామాలు చూస్తే గొప్ప గుణపాఠం నేర్చుకున్నట్టయింది. అందరూ బాగానే ఉన్నారు… నేను మాత్రం రోడ్డున పడ్డాను. ఇదంతా గతం.

ఎవరో చెప్పారని ఇలా రావడంలేదు. ఆత్మపరిశీలన చేసుకున్నాను. ఈ సందర్భంగా నేను పవన్ కల్యాణ్ గారి నినాదాన్ని ఫాలో అవుతాను. ఆత్మగౌరవానికి, అహంకారానికి మధ్య జరిగే పోరాటం అని ఆయన అన్నారు. దాన్ని నేను అనుసరిస్తాను. నేను రాజకీయాల్లో ప్రచారం చేస్తున్న సమయంలో కూడా మెగాస్టార్ చిరంజీవి గారు ‘సైరా’లో నాకో క్యారెక్టర్ ఇచ్చారు. అదీ ఆయన గొప్పదనం.

నా జీవిత అనుభవాల నేపథ్యంలో బంధువులను, స్నేహితులను నమ్మడం మానేశాను. చరిత్రలో జరిగిన వెన్నుపోట్లేమో కానీ, నాకు జరిగిన అనేక వెన్నుపోట్లు చూశాను. 2020లో కొవిడ్ సోకినప్పుడు ఇక బతుకుతానో లేదో అని భావించినప్పుడు నన్ను ఆదుకుంది సినీ పరిశ్రమే. సాయికుమార్, జీవిత, రాజశేఖర్, రఘుబాబు వంటి వాళ్లందరూ ధైర్యంగా ఉండాలని చెప్పారు. నాకోసం ప్రార్థించిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను కోలుకున్న తర్వాత అరుణాచల క్షేత్రాన్ని సందర్శించుకున్నాను.

అసలు నాలాంటి వాడికి ఇవన్నీ అవసరమా? అనిపిస్తుంది. నా వెనుకాల ఉన్న ఓ కొండను చూసుకుని కొన్ని మాటలు తప్పుగా మాట్లాడాను. అరుణాచలంలో రమణ మహర్షి క్షేత్రంలో ధ్యానం చేస్తుంటే కళ్లముందు అనేక విషయాలు సాక్షాత్కారం అయ్యాయి. అప్పట్లో విర్రవీగిన నేను ఇండస్ట్రీ పెద్దల గురించి ఓ మాట అన్నాను. కానీ, ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలందరూ ఒక్కటయ్యారు… పృథ్వీరాజ్ మాత్రం ఫుట్ బాల్ లా ఎక్కడికో వెళ్లి పడ్డాడు.

నా కామెడీ నాకే తగిలినట్టుంది. నాలాంటి వాడికి రాజకీయాలు పనికిరావని అర్థమైంది. ఇకమీదట పెద్ద బ్యానర్ల వాళ్లందరినీ కలుస్తాను. ఈ సందర్భంగా అశ్వనీదత్ గారిని కూడా క్షమించమని కోరుతున్నాను. గురూజీ రాఘవేంద్రరావు, చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్, మెగా హీరోలందరినీ కలుస్తాను. నేను మారాను… అందులో భాగంగానే మీ వద్దకు వస్తున్నాను… మార్పు కోసం ఒక్కడుగు నేను వేస్తుంటే వంద అడుగులు మీరు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ వినమ్రంగా అర్థించారు.

Related posts

రసవత్తరంగా మారిన మూవీ ఆర్టిస్ట్ అసోషివేషన్ ఎన్నికలు!

Drukpadam

సీఎం సీఎం అని అరిస్తే సరిపోదు.. మీకు దమ్ముంటే.. : నాగబాబు అసహనం!

Drukpadam

పుట్టిన రోజున బిగ్‌బీని చూసి అభిమానుల్లో సంబరం

Ram Narayana

Leave a Comment