మా సహనాన్ని పరీక్షించకండి… వైసీపీకి పవన్ కల్యాణ్ వార్నింగ్!
- వైసీపీ పరుష పదజాలంపై పవన్ ఆగ్రహం
- తామూ అలా మాట్లాడగలమంటూ హెచ్చరిక
- వ్యక్తిగత అజెండా లేకుండా పనిచేస్తున్నామని వెల్లడి
- ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేసిన పవన్
జనసేన నేతలపైనా.. ప్రత్యేకించి తనపైనా వైసీపీ అగ్రనేతలు చేస్తున్న వ్యాఖ్యలపై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. తాను విధానాల మీదనే మాట్లాడుతున్నానని చెప్పిన పవన్ కల్యాణ్.. వ్యక్తిగత దూషణలకు దిగడం లేదని తెలిపారు. అంతేకాకుండా జనసేన నేతలను రాక్షసులు, దుర్మార్గులుగా అభివర్ణిస్తున్న వైసీపీ నేతలపై తాము కూడా అదే మాదిరిగా దూషణలకు దిగే సత్తా ఉందని కూడా ఆయన హెచ్చరించారు. వ్యక్తిగత అజెండా లేకుండా సాగుతున్న తమ సహనాన్ని పరీక్షించరాదని ఆయన వైసీపీ అగ్ర నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు కాసేపటి క్రితం ఆయన ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు.
ఆ వీడియోలో పవన్ మాట్లాడుతూ.. “జనసేనను మొదలుపెట్టినప్పటి నుంచి నాకు వ్యక్తిగత అజెండా లేదు. ప్రజలు బాగుండాలి. ప్రజలు పల్లకీ ఎక్కాలని కోరుకునే వాడిని. భవన నిర్మాణ కార్మికుల నుంచి మొదలుకొని కౌలు రైతుల వరకు.. ఉద్యోగస్తులు రోడ్ల మీదకు వచ్చారు. మీరు నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా.. జాబ్ కేలండర్ ప్రకటించకపోయినా.. మీరు చేయని విధానాల మీదనే మాట్లాడుతున్నా.
అలాంటి మమ్మల్ని మీరు రాక్షసులు, దుర్మార్గులు అంటూ పిచ్చిపిచ్చిగా మాట్లాడితే… నేను మీ కంటే బలంగా మాట్లాడగలను. వైసీపీ అగ్రనాయకత్వం తెలుసుకోవాల్సింది ఏమిటంటే.. నేను విధానాల గురించే మాట్లాడుతున్నా. పాలసీల గురించే మాట్లాడుతున్నా. మీరు వ్యక్తిగత దూషణలకు దిగితే.. మీకు అలాంటిదే కావాలంటే కచ్చితంగా ఏ సమయంలో ఎంత ఇవ్వాలో బాగా తెలిసిన వాడిని. మీరు ఆలోచించుకుని మాట్లాడండి. మీరు నోటికి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే.. మాకూ సహనం ఉంటుంది. ఆ సహనాన్ని దయచేసి పరీక్షించకండి” అంటూ పవన్ వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.