- కరోనా నేపథ్యంలో ఇంటి నుంచి పని వెసులుబాటు
- బీసీజీ, జూమ్ సర్వేలో ఆసక్తికర విషయాలు
- నాలుగు రెట్లకు పెరిగిన ఇంటి నుంచి పనిచేసే వారి సంఖ్య
- మేనేజర్ స్థాయి ఉద్యోగుల్లో 70% ఇంటి నుంచి పనికి మొగ్గు
- కంపెనీలకు డబ్బు.. ఉద్యోగులకు ఉపాధి సేఫ్
కరోనా వెలుగులోకి వచ్చిన తర్వాత చాలా సంస్థలు తమ ఉద్యోగులకు తప్పనిసరి పరిస్థితుల్లో ‘ఇంటి నుంచి పని’ చేసే వెసులుబాటు కల్పించారు. అయితే, ఇప్పుడు ఈ విధానాన్ని శాశ్వతంగా కొనసాగించాలని 87 శాతం సంస్థలు యోచిస్తున్నాయని బీసీజీ, జూమ్ కలిసి నిర్వహించిన సర్వేలో తేలింది. అలాగే కరోనా సమయంలో ఇప్పటి వరకు ఇంటి నుంచి పనిచేసే వారి సంఖ్య దాదాపు నాలుగు రెట్లు ఎక్కువైనట్లు సర్వే తేల్చింది. కరోనా మూలంగా ఏర్పడ్డ ప్రపంచ ఆర్థిక సంక్షోభ కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా కంపెనీలపై పడిన ఆర్థిక ప్రభావం, పనితీరు గురించి అంచనా వేయడానికి బీసీజీతో కలిసి జూమ్ ఈ సర్వే నిర్వహించింది.
భారత్ సహా అమెరికా, యూకే, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు. మేనేజర్ స్థాయి ఉద్యోగుల్లో 70 శాతం మంది ఇంటి నుంచి పనికి అనుకూలంగా ఓటేశారు. చిన్న చిన్న సమస్యలు తప్ప, కరోనా మహమ్మారి ముందుకంటే ఇప్పుడు పనితీరు బాగా మెరుగైనట్లు సంస్థలు కూడా చెప్పడం గమనార్హం. కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా కంపెనీలకు పెద్ద మొత్తంలో డబ్బు ఆదా అయినట్లు తెలిసింది. అలాగే చాలా మంది ఉద్యోగాలు కూడా నిలబడ్డాయి. ఒక్క యూరప్‌లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా 22.8 లక్షల ఉద్యోగాలు నిలిచినట్లు తెలిసింది.