కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్.. అనూహ్యంగా దిశ మార్చుకున్న ‘అసని’!
-ఆగ్నేయ దిక్కుకు మళ్లిన తుపాను
-నర్సాపురం దిగువన అల్లవరం వద్ద తీరాన్ని తాకే అవకాశం
-ఇవాళ సాయంత్రానికి తిరిగి సముద్రంలోకి వెళ్లే చాన్స్
-అప్పటిదాకా తీరం వెంబడే తుపాను పయనం
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అసని’ తుపాను అనూహ్యంగా దిశ మార్చుకుంది. వాయవ్య దిశకు పయనిస్తుందని ముందు అనుకున్నా.. ఇప్పుడా తుపాను ఆగ్నేయ దిక్కుకు మళ్లింది. నర్సాపురానికి 30 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. నర్సాపురం తీరానికి దిగువన అల్లవరానికి సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ప్రస్తుతం 6 కిలోమీటర్ల వేగంతో తుపాను కదులుతున్నట్టు తెలిపింది.
తీరాన్ని తాకిన తర్వాత ఇవాళ సాయంత్రం యానాం వద్ద తిరిగి సముద్రంలోకి తుపాను ప్రవేశించే అవకాశాలున్నాయని పేర్కొంది. ఆ తర్వాత క్రమంగా తుపాను వాయుగుండంగా బలహీనపడుతుందని చెప్పింది. అయితే, పూర్తిగా బలహీనపడే వరకు అది తీరం వెంబడే పయనిస్తుందని పేర్కొన్న వాతావరణ కేంద్రం.. కోస్తాంధ్ర తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
తుఫాన్ సహాయక చర్యలపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీరు ప్రాంత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు . తుఫాన్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఒక్క క్యాజువాలిటీ లేకుండా జిల్లా కలెక్టర్లు , ఎస్పీ లు చర్యలు తీసుకోవాలని , లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలంచి వారికీ భోజన సదుపాయం ఏర్పాటు చేయాలనీ ఆదేశించారు . ఎక్కడ కూడా లోపాలు లేకుండా తగని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు .