Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాహుల్ జంటిల్ మాన్…కానీ రాజకీయాలకు పనికి రాడు: గులాంనబీ ఆజాద్…

రాహుల్ జంటిల్ మాన్…కానీ రాజకీయాలకు పనికి రాడు: గులాంనబీ ఆజాద్
-రాహుల్ గాంధీని ప్రశంసిస్తూనే.. తీవ్ర విమర్శలు
-సొంత పార్టీపై క్లారిటీ ఇచ్చిన ఆజాద్!
-రాహుల్ మంచి వ్యక్తి.. జంటిల్మన్ అన్న ఆజాద్
-అయితే రాజకీయాలకు మాత్రం యోగ్యుడు కాదని వ్యాఖ్య
-మోదీపై దాడి చేయడమే రాహుల్ పాలసీ అని విమర్శ
-ఇందిర, రాజీవ్, సంజయ్ గాంధీల మాదిరి కష్టపడేతత్వం లేదని వ్యాఖ్య
-జమ్మూకశ్మీర్ లో సొంత పార్టీని పెట్టబోతున్నానని క్లారిటీ ఇచ్చిన ఆజాద్

కాంగ్రెస్ కు ఇటీవల రాజీనామా చేసిన గులాంనబీ ఆజాద్ రాహుల్ గాంధీని ఒకపక్క ప్రశంసిస్తూనే మరోపక్క విమర్శలు గుప్పించి తన రాజకీయ చాణిక్యతను చాటుకున్నారు . రాజీనామా సందర్భంగా రాహుల్ గాంధీపై ఆయన విమర్శలు గుప్పించారు. రాహుల్ ది పిల్లవాడి మనస్తత్వమని, మెచ్యూరిటీ లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకున్నారు.

ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాహుల్ గాంధీని ఆజాద్ ప్రశంసించారు. రాహుల్ చాలా మంచి వ్యక్తి అని కితాబిచ్చారు. అయితే రాజకీయాలకు ఆయన పనికిరారని అన్నారు. ప్రధాని మోదీని ఎదుర్కోవడంలో రాహుల్ పూర్తిగా విఫలమయ్యారని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే సీడబ్ల్యూసీకి అర్థమే లేకుండా పోయిందని ఆజాద్ విమర్శించారు. గతంలో సీడబ్ల్యూసీలో కేవలం సీడబ్ల్యూసీ మెంబర్లు మాత్రమే ఉండేవారని… కానీ, గత పదేళ్లలో 25 మంది సీడబ్ల్యూసీ మెంబర్లతో పాటు, 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు కూడా ఉంటున్నారని అన్నారు. 1998 నుంచి 2004 వరకు సోనియాగాంధీ ప్రతి విషయంలో సీనియర్లను సంప్రదించేవారని, సీనియర్లు ఇచ్చే సలహాలను, సూచనలను ఆమె స్వీకరించేవారని చెప్పారు. 2004 నుంచి ఆమె సీనియర్లను పక్కన పెట్టేసి, పూర్తిగా రాహుల్ పై ఆధారపడటాన్ని ప్రారంభించారని తెలిపారు. ప్రతి ఒక్కరు రాహుల్ కు సహకరించాలని చెప్పేవారని అన్నారు. రాహుల్ కు రాజకీయాలను నడిపే శక్తిసామర్థ్యాలు లేవని చెప్పారు.

2014 ఎన్నికల కోసం తాను కాంగ్రెస్ కు ఎన్నో సూచనలు చేశానని, ఆర్గనైజేషనల్ ప్లాన్ ను ఇచ్చానని… అయితే, రాహుల్ వాటిని పట్టించుకోలేదని ఆజాద్ అన్నారు. తాను ఎన్నో సార్లు గుర్తు చేసినా రాహుల్ స్పందించలేదని చెప్పారు. 2014 ఎన్నికల తర్వాత కూడా రాబోయే ఎన్నికలకు సంబంధించి తాను తన ప్లాన్ల గురించి రాహుల్ కు ఎన్నో సార్లు గుర్తు చేశానని… ఇప్పటికి తొమ్మిదేళ్లు గడుస్తున్నా తన ప్లాన్లన్నీ ఏఐసీసీ స్టోర్ రూమ్ లో పడున్నాయని అన్నారు. పార్టీని బలోపేతం చేసే దిశగా వారు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని విమర్శించారు.

2019 ఎన్నికల్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ‘చౌకీదార్ చోర్ హై’ నినాదాన్ని రాహుల్ తీసుకొచ్చారని… ఈ నినాదానికి మద్దతు పలికే నేతలు చేతులు ఎత్తాలని పార్టీ మీటింగ్ లో రాహుల్ అడగారని… అయితే చాలా మంది సీనియర్ నేతలు ఆ నినాదాన్ని వ్యతిరేకించారని ఆజాద్ చెప్పారు. ఆ మీటింగ్ లో తాను, మన్మోహన్ సింగ్, ఏకే ఆంటోనీ, చిదంబరం కూడా ఉన్నామని తెలిపారు.

ఇందిరాగాంధీ నుంచి తాము రాజకీయాలను నేర్చుకున్నామని ఆజాద్ చెప్పారు. తాను జూనియర్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఒకరోజు తనను, ఎంఎల్ ఫోతేదార్ ను ఇందిరాగాంధీ పిలిపించారని… అటల్ బిహారీ వాజ్ పేయితో మనం రెగ్యులర్ గా సమావేశమవుతూ ఉండాలని చెప్పారని గుర్తు చేసుకున్నారు. పెద్దలను గౌరవించడం, విపక్ష నేతలను కూడా సమానంగా గౌరవించాలనేది తాము ఇందిర నుంచి నేర్చుకున్నామని తెలిపారు. సీనియర్ నేతలను అటాక్ చేయాలని రాహుల్ తమకు చెప్పలేదా? అని ప్రశ్నించారు. మోదీపై దాడి చేయడమే రాహుల్ గాంధీ పాలసీ అని విమర్శించారు. కేంద్ర కేబినెట్ లో పని చేసిన సీనియర్ నేతలు ఇలాంటి భాషను ఎలా వాడగలమని అన్నారు.

రాహుల్ పై తనకు ఎలాంటి పగ లేదని ఆజాద్ చెప్పారు. రాహుల్ ఒక మంచి వ్యక్తి, జంటిల్మన్ అని ప్రశంసించారు. తన పట్ల రాహుల్ ఎప్పుడూ విధేయతతోనే ఉన్నారని అన్నారు. అయితే రాజకీయవేత్తగా మాత్రం రాహుల్ యోగ్యుడు కాదని చెప్పారు. తన నానమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ, చిన్నాన్న సంజయ్ గాంధీల మాదిరి కష్టపడే తత్వం రాహుల్ కి లేదని అన్నారు. తాను సొంత పార్టీ పెట్టబోతున్నాననే వార్తలపై స్పందిస్తూ… జమ్మూకశ్మీర్ లో సొంత పార్టీని పెట్టబోతున్నానని స్పష్టం చేశారు. బీజేపీలో చేరబోనని తెలిపారు.

Related posts

కుట్ర మహా కుట్ర …బీజేపీ గేమ్ ప్లాన్ లో భాగమేనా …?

Drukpadam

ఢిల్లీకి మారిన అమరావతి రైతుల యాత్ర…జంతర్ మంతర్ వద్ద ధర్నా !

Drukpadam

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఐడీ నోటీసులు

Drukpadam

Leave a Comment