ఆసియా కప్ విజేత శ్రీలంక… ఫైనల్లో పాకిస్థాన్ కు భంగపాటు!
- తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగులు
- పాకిస్థాన్ టార్గెట్ 171 రన్స్
- 20 ఓవర్లలో 147 ఆలౌట్
- మధుషాన్ కు 4 వికెట్లు
- ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసిన హసరంగ
జట్టునిండా మ్యాచ్ విన్నర్లతో నిండిన పాకిస్థాన్ ను చిత్తు చేస్తూ ఆసియా కప్ టోర్నీలో శ్రీలంక జట్టు విజేతగా అవతరించింది. 171 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాకిస్థాన్ ను 23 పరుగుల తేడాతో ఓడించింది. తద్వారా సగర్వంగా టైటిల్ ఎగురేసుకెళ్లింది. పాక్ జట్టు 20 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది.
లంక బౌలర్లు మధుషాన్, హసరంగ పాక్ బ్యాటింగ్ ఆర్డర్ ను కకావికలం చేశారు. ఓపెనర్ రిజ్వాన్ (55) అర్ధసెంచరీతో రాణించగా, ఇఫ్తికార్ అహ్మద్ 32 పరుగులు చేశాడు. వీరిద్దరు మినహా పాక్ జట్టులో మిగతా వాళ్లందరూ విఫలమయ్యారు.
ముఖ్యంగా, కెప్టెన్ బాబర్ అజామ్ తన పేలవ ఫామ్ ను ఈ మ్యాచ్ లోనూ కొనసాగించాడు. బాబర్ (5), ఫకార్ జమాన్ (0)లను మధుషాన్ వరుస బంతుల్లో అవుట్ చేశాడు. ఆ తర్వాత రిజ్వాన్, ఇఫ్తికార్ దూకుడు చూస్తే మ్యాచ్ పాక్ వైపే మొగ్గుతున్నట్టు కనిపించింది. అయితే మధుషాన్ మరోసారి విజృంభించి ఇఫ్తికార్ ను అవుట్ చేసి లంకను మళ్లీ రేసులోకి తెచ్చాడు. ఆ తర్వాత నవాజ్ ను కరుణరత్నే అవుట్ చేయడంతో పాకిస్థాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. అప్పటికి పాక్ స్కోరు 15.2 ఓవర్లలో 102-4.
ఈ దశలో హసరంగ విజృంభించి ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీయడంతో పాక్ ఇక కోలుకోలేకపోయింది. ఫామ్ లో ఉన్న రిజ్వాన్, మ్యాచ్ ఫినిషర్ గా పేరుపొందిన ఆసిఫ్ అలీ (0), హార్డ్ హిట్టర్ కుష్దిల్ షా (2)ల వికెట్లు తీసిన హసరంగ మ్యాచ్ ను మలుపుతిప్పాడు.
చివర్లో సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోవడంతో పాక్ టెయిలెండర్లకు అది శక్తికి మించిన పనైంది. తీక్షణ… షాదాబ్ ఖాన్ ను అవుట్ చేయగా, మధుషాన్… నసీమ్ షాను పెవిలియన్ చేర్చాడు. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి కరుణరత్నే… రవూఫ్ ను బౌల్డ్ చేయడంతో పాక్ కథ ముగిసింది.
లంక బౌలర్లలో మధుషాన్ 4, హసరంగ 3, కరుణరత్నే 2, తీక్షణ 1 వికెట్ తీశారు. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో శ్రీలంక ఫీల్డింగ్ అత్యున్నత స్థాయిలో ఉంది. లంక ఆటగాళ్లు క్యాచ్ లు పట్టిన తీరు వారిలోని విజయకాంక్షను ప్రతిబింబించింది.
శ్రీలంక ఖాతాలో ఇది 6వ ఆసియా కప్ టైటిల్. శ్రీలంక జట్టు గతంలో 1986, 1997, 2004, 2008, 2014లోనూ టైటిల్ సాధించింది. అత్యధిక టైటిళ్ల విషయంలో టీమిండియా 7 టైటిళ్లతో ముందంజలో ఉంది.