తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం: కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి!
- బండి సంజయ్ యాత్ర నాలుగో దశ ముగింపు
- పెద్ద అంబర్ పేట్ లో ముగింపు సభ
- ముఖ్య అతిథిగా హాజరైన సాధ్వీ నిరంజన్ జ్యోతి
- బీజేపీ అధికారంలోకి వచ్చాక దోపిడీదారులంతా పరారేనని వ్యాఖ్య
రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ విజయం సాధిస్తుందని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి అన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర నాలుగో దశ గురువారం పెద్ద అంబర్ పేటలో ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సాధ్వీ నిరంజన్ జ్యోతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలపై నిప్పులు చెరిగారు.
బీజేపీని మతతత్వ పార్టీగా అభివర్ణిస్తున్న కేసీఆర్… మజ్లిస్ పార్టీని మాత్రం ఎందుకు అక్కున చేర్చుకుంటున్నారని నిరంజన్ జ్యోతి ప్రశ్నించారు. దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటున్న వారు ఎవరని ఆమె ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా దేశంలోని కుటుంబ పార్టీలన్నీ ఏకం అవుతున్నాయన్నారు. గ్రామ పంచాయతీలకు కేంద్రం విడుదల చేసిన నిధులను కేసీఆర్ సర్కారు దుర్వినియోగం చేస్తోందని ఆమె ఆరోపించారు. పేదల మరుగుదొడ్ల నిర్మాణం కోసం ఇచ్చిన నిధులను కూడా కేసీఆర్ పక్కదారి పట్టిస్తున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దోపిడీదారులంతా చాప చుట్టేయాల్సిందేనని ఆమె జోస్యం చెప్పారు.