ఖమ్మం టీఆర్ యస్ లో లుకలుకలు…
-మాజీ ఎంపీ వర్గం తీవ్ర అసంతృప్తి
-నామ ప్రతిపాదనకు సున్నితంగా సమాధానం
– పట్టించుకోని తుమ్మల వర్గీయులు
-మంత్రిపైనే భారం పెట్టిన కేసీఆర్
ఖమ్మం టీఆర్ యస్ లో అంతా బాగుంది. ఖమ్మం కార్పొరేషన్ లో తిరుగులేదని భావిస్తున్న తరుణంలో స్వంత పార్టీలోనే లుకలుకలు బయలు దేరాయి. టికెట్ లు లభించని కొందరు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇది ఎటు దారితీస్తుందో అన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి . ఎప్పటినుంచో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పార్టీ నుంచి సాగనంపాలని ఆలోచనలో టీఆర్ యస్ లోని ఒక వర్గం కాచుకు కూర్చొని ఉందనే
అభిప్రాయాలూ ఉన్నాయి. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ తరుపున ఖమ్మం ఎంపీ గా అనూహ్య విజయం సాధించిన ఆయన తరువాత టీఆర్ యస్ లో చేరారు . ఆయన చేరిక సందర్భంగా తిరిగి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ తీరా ఎన్నికలకు ముందు ఆయన టికెట్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా టికెట్ ఇవ్వలేదు. తరువాత అదే స్థాయిలో ఉన్న రాజ్యసభ ఇస్తామన్నారని ప్రచారం జరిగింది .కాని అది జరగలేదు . అయనప్పటికీ ఆయన తనకు పార్టీ లో ఎదో ఒక పదవి రాకపోతుందా అని భారం అంతా మంత్రి పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పై వేశారు . పార్టీలో ఫైర్ బ్రాండ్ గా ఉన్న శ్రీనివాస్ రెడ్డి మాట పార్టీలో చెల్లుబాటు కావటం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి . జిల్లాలో ఆయనకు బలమైన అనుచర గణం ఉంది . ఎంపీ టికెట్ రాకపోయినా నిత్యం ప్రజలలో తిరుగుతూ సంబంధాలను కొనసాగిస్తున్నారు. అప్పుడప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీ లోకి వెళ్లుతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈ విషయాన్నీ ఆయన స్వయంగా అనేక సార్లు ఖండించారు. కేటీఆర్ తో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఆయన పై నమ్మకమం పెట్టుకొని అడుగులు వేస్తున్నారు. మరో పక్క పరిస్థితులు మాత్రం ఆయన ఊహించినదానికి భిన్నంగా ఉన్నాయి. పార్టీ ఆయన్ను పొమ్మన లేక పొగబెడుతుందనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి . జరుగుతున్నా పరిణామాలు చూస్తే అదినిజమే అనిపిస్తుంది. కార్పొరేషన్ లో గల 60 డివిజన్లలో తమవారికి కొన్ని సీట్లు ఇవ్వాలని మాజీ ఎంపీ ప్రతిపాదించగా అందుకు మంత్రి ససేమీరా అంటున్నట్లు విశ్వసనీయ సమాచారం . దీనిపై పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ మంత్రి కేటీఆర్ దగ్గర మాజీ ఎంపీ ప్రస్తావించగా ఈ విషయాలు జిల్లాలోనే మీరే పరిష్కరించుకోండి అన్నట్లు తెలుస్తుంది . దీనిపై మంత్రి అజయ్ ని కలిసి అనుయాయులకు కొన్ని డివిజన్లు కేటాయించాలని ప్రతిపాదించగా అలాంటిది కుదరదని కుండ బద్దలు కొట్టినట్లు సమాచారం .దీనిపై మాజీ ఎంపీ తీవ్ర అసంతృప్తి తో ఉన్నారు. తనకు జరిగిన అవమానం పై తీవ్ర వేదనతో ఉన్నట్లు తెలుస్తుంది . ఇక ప్రస్తుత ఎంపీ గా ఉన్న నామ కార్పొరేషన్ చైర్మన్ గా ఒక వ్యక్తి పేరు సూచించటంతో పాటు మరొకరికి సీటు ఇవ్వాలని సిఫార్స్ చేశారు. దానికి మంత్రి చాల సున్నితంగా నామగారు అంతా మీవాళ్ళకే సీట్లు ఇస్తున్నాం కదండీ అన్నారని వినికిడి . మాజీ మంత్రి తుమ్మల అనుయాయులు సైతం దూరంగా ఉన్నారు.
ఖమ్మం నగర కార్పొరేషన్ ఎన్నికలపై మంత్రి అజయ్ ముందుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి తాను ఏవిధంగా వ్యవహరించాలనే దానిపై క్లారిటీ తీసుకున్నట్లు తెలుస్తుంది . అజయ్ కి పూర్తీ భాద్యత అప్పగిస్తూ అంతా నీఇష్టం కాని కార్పొరేషన్ గెలవాలి అని కేసీఆర్ అన్నట్లు తెలుస్తుంది . ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం కార్పొరేషన్ గెలిపించి తీసుకొచ్చే భాద్యతను పూర్తిగా అజయ్ మీద పెట్టడంతో ఎవరు జోక్యం చేసుకునే ఆవకాశం లేకుండా పోయింది . అజయ్ అందుకనుగుణంగా అభ్యర్థుల ఎంపికతో పాటు అన్ని తానై వ్యవహరిస్తున్నారు. ఎవరిని ఎందులో వేలు పెట్టనివ్వడం లేదు . మాజీ మంత్రి తుమ్మల వర్గీయులు సైతం దూరంగా ఉన్నారు .ముఖ్యమంత్రి ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ తో ఖమ్మం నగర కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ యస్ లో వర్గాలు గిర్గాలు జాన్తానహి , అంతా అజయ్ వర్గమే హల్చల్ చేస్తుంది. ఇక్కడ అజయ్ మాటకు తిరుగులేదు.అందువల్ల పార్టీలో ఇమడ లేని వారు బయటకు పోతున్నారు. మొత్తం 60 డివిజన్లలో టీఆర్ యస్ సిపిఐ కూటమిని గెలిపించాలని పట్టుదలతో మంత్రి పావులు కదుపుతున్నారు. అయితే కొన్ని చోట్ల బలహీనమైన అభ్యర్థులు ఉండటం కొంత మైనస్ గా మారింది . కొన్ని సీట్లను ఏకగ్రీవం చెయ్యాలని బాహించినా , కాంగ్రెస్ ,బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎన్నికల వాతావరణం వేడెక్కింది. టీఆర్ యస్ కు కేక్ వాక్ అనుకున్న, వార్ వన్ సైడ్ గా లేదు. మంత్రి మాత్రం తనదైన శైలిలో తిరిగి ఖమ్మం కార్పొరేషన్ పై గులాబీ జెండా ఎగురవేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.