వైరల్ అవుతున్న ఉత్తరాఖండ్ హతురాలి వాట్సాప్ సందేశాలు
- ఉత్తరాఖండ్ లో ఓ లేడీ రిసెప్షనిస్టు హత్య
- ఈ ఉదయం కాలువ వద్ద మృతదేహం గుర్తింపు
- రిసార్టులో రూ.10 వేలు చెల్లిస్తే ‘ప్రత్యేక సేవలు’
- వ్యభిచారం చేయాలంటూ తనను ఒత్తిడి చేస్తున్నారన్న యువతి
ఉత్తరాఖండ్ లో 19 ఏళ్ల రిసెప్షనిస్టు నాలుగు రోజుల కిందట అదృశ్యం కాగా, ఆమె హత్యకు గురైనట్టు వెల్లడైంది. ఈ కేసులో బీజేపీ సీనియర్ నేత కుమారుడు పులకిత్ ఆర్యా ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. బీజేపీ నేత తనయుడితో పాటు ఆ టీనేజి అమ్మాయి పనిచేస్తున్న రిసార్టు మేనేజర్ సౌరభ్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ గుప్తాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ యువతి మృతదేహాన్ని ఈ ఉదయం ఓ కాలువ వద్ద గుర్తించారు.
కాగా, ఆ యువతి తన ఫ్రెండ్ కు పంపినట్టుగా భావిస్తున్న వాట్సాప్ సందేశాలు వైరల్ అవుతున్నాయి. తనను వేశ్యగా మార్చేందుకు రిసార్ట్ వాళ్లు ప్రయత్నిస్తున్నారని ఆమె తన సందేశాల్లో పేర్కొంది. రూ.10 వేలు చెల్లించిన కస్టమర్లకు ‘ప్రత్యేక సేవలు’ అందించాలని రిసార్ట్ యాజమాన్యం తనను ఒత్తిడికి గురిచేస్తోందని ఆమె వెల్లడించింది.
అంతేకాకుండా, రిసార్ట్ లో ఓ వ్యక్తి తనను అసభ్యంగా తాకాడని, అయితే, అతడు మద్యం మత్తులో ఉన్నందున ఆ విషయాన్ని పట్టించుకోవద్దని రిసార్ట్ యాజమాన్యం చెప్పిందని ఆమె తన సందేశంలో వివరించింది.
దాంతోపాటే, రిసార్ట్ లోని ఓ ఉద్యోగికి ఆమె చేసిన వాయిస్ కాల్ కూడా తెరపైకి వచ్చింది. తన బాధలను ఆమె ఏడుస్తూ వివరించినట్టు ఆ కాల్ ద్వారా వెల్లడైంది.