Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

లాక్ డౌన్ అనేది చివరి అస్త్రం కావాలి … ప్రధాని

pm modi addresses the nation
ఎక్కడ ఉన్నవారికి అక్కడే టీకా.. అవసరమైతేనే బయటకు రావాలి: ప్రధాని మోదీ
  • జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ
  • అవసరమైతేనే బయటకు రావాలని విజ్ఞప్తి
  • అవసరమున్న ప్రతిఒక్కరికీ ఆక్సిజన్‌ అందిస్తామన్న మోదీ
  • ఔషధాల తయారీ పెంపునకూ విశేష కృషి
  • చివరి ప్రత్యామ్నాయంగా లాక్‌డౌన్‌
  • రాముని వలే నియమాలను అనుసరించాలన్న ప్రధాని
దేశవ్యాప్తంగా కరోనా మహోగ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో నేడు ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. మహమ్మారి విలయతాండవం నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఆయన  వివిధ వర్గాలతో విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతున్నారు. అందులో భాగంగా నేడు వ్యాక్సిన్‌ తయారీ పరిశ్రమ ప్రతినిధులతో చర్చించారు.

కొన్ని రోజుల క్రితం కాస్త తగ్గుముఖం పట్టిన మహమ్మారి మరోసారి తుపాన్‌లా విరుచుకుపడుతోందని ప్రధాని తెలిపారు. అందరం కలిసి కట్టుగా దీనిపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కరోనాను అంతమొందించే పోరులో ముందున్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్లను ప్రశంసించారు. తమ వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి మరీ వారు దేశం కోసం పోరాడుతున్నారని తెలిపారు.

గత కొన్ని రోజులుగా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌కు డిమాండ్‌ ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా అవసరమున్న ప్రతిఒక్కరికీ ఆక్సిజన్‌ అందేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఆక్సిజన్‌ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే ఔషధాల తయారీని పెంచేందుకు సైతం తగిన చర్యలు చేపట్టామన్నారు. ఈ క్రమంలో ఔషధ తయారీ సంస్థలు విశేషంగా కృషి చేస్తున్నాయన్నారు.

శాస్త్రవేత్తలు రాత్రీపగలు కష్టపడి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. ఈ క్రమంలో ప్రైవేట్‌ సంస్థల కృషిని ప్రధాని ప్రశంసించారు. ప్రతి ఒక్కరికీ వీలైనంత త్వరగా టీకా అందించేందుకు కృషి జరుగుతోందన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా టీకాలు అందిస్తున్న దేశంగా భారత్‌ కొనసాగుతోందన్నారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ద్వారా ఇప్పటికే వైద్యారోగ్య సిబ్బందికి ఫలాలు అందుతున్నాయన్నారు. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకా అందించనున్నామని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టీకా కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందన్నారు.

నగరాల్లో పనిచేస్తున్న కార్మికులకు వేగంగా వ్యాక్సిన్‌ అందించాలన్న ఉద్దేశంతోనే 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకా అందించేందుకు అనుమతి ఇచ్చామని తెలిపారు. వివిధ నగరాల్లో పనిచేస్తున్న శ్రామికులకు వారున్న చోటే టీకా అందిస్తామన్న భరోసా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. తద్వారా వారిలో ఎలాంటి గందరగోళం లేకుండా చూడాలని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే కరోనాను ఎదుర్కొనేందుకు కావాల్సిన మౌలిక వసతులు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. ఈ ఘనత దేశప్రజలందరికీ వర్తిస్తుందని తెలిపారు. దేశంలోని ప్రతిఒక్కరూ సహకరిస్తేనే కరోనాపై విజయం సాధించగలమన్నారు.

యువకులు స్థానికంగా కమిటీలుగా ఏర్పడి ఆయా ప్రాంతాలలో ప్రతిఒక్కరూ కరోనా నిబంధనలు పాటించేలా చూడాలని మోదీ సూచించారు. అప్పుడు ప్రభుత్వాలు ఎలాంటి కంటైన్‌మెంట్‌ జోన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదన్నారు. అలాగే ఇంట్లో నుంచి అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని పిలుపునిచ్చారు. అలాగే ఇంట్లో ఎలాంటి భయాందోళన వాతావరణం ఉండకూడదన్నారు. ఆర్థిక వ్యవస్థపై తక్కువ ప్రభావం పడేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

మరోసారి లాక్‌డౌన్‌ విధించే పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను చివరి ప్రత్యామ్నాయంగానే భావించాలని సూచించారు. మైక్రోకంటైన్‌మెంట్‌ జోన్‌ విధానానికే పరిమితం కావాలని సూచించారు. రేపు శ్రీరామ నవమి అని గుర్తుచేసిన ప్రధాని.. ప్రతిఒక్కరూ ఆదర్శపురుషుడు రాముని వలే నియమాలను అనుసరించి నడుచుకోవాలని హితవు పలికారు. కరోనా నుంచి తప్పించుకునేందుకు ఉన్న అన్ని మార్గాలను 100 శాతం పాటించాలని సూచించారు.

Related posts

తమిళనాడులో కొత్త ప్రయోగం.. అందరికి ఆరోగ్యం బిల్లుకు కసరత్తు!

Drukpadam

పరస్పర అంగీకారంతో శారీరకంగా కలిసి.. ఆపై పెళ్లికి నిరాకరించడం మోసం కాదు: బాంబే హైకోర్టు కీలక తీర్పు!

Drukpadam

వంట నూనె ధరలు తగ్గించే ప్రయత్నం చేయండి.. ఏపీ సహా 8 రాష్ట్రాలకు కేంద్రం లేఖలు…

Drukpadam

Leave a Comment