సుప్రీంకోర్టులో ఈసీ ప్యానల్ న్యాయవాది రాజీనామా!
- ఈసీ విధానాలకు అనుగుణంగా తన విలువలు లేవన్న మోహిత్
- ఈ కారణం వల్లే ప్యానల్ ను వీడుతున్నానని వెల్లడి
- ఈసీకి పని చేయడం తన జీవితంలో మైలురాయని వ్యాఖ్య
కోర్టు వాదనలపై ప్రసారం చేయకుండా మీడియాను నియంత్రించాలంటూ సుప్రీంకోర్టులో ఈసీ పిటిషన్ వేసిన నేపథ్యంలో మోహిత్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి చెందడానికి ఎన్నికల సంఘమే కారణమని… ఈసీ అధికారులపై హత్యాయత్నం కేసులు నమోదు చేస్తామని మద్రాస్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తన తీర్పులో ఈ వ్యాఖ్యలను హైకోర్టు పొందుపరచలేదు. కానీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు మీడియాలో ప్రముఖంగా ప్రచురితమయ్యాయి. తమ గౌరవానికి భంగం కలిగించేలా హైకోర్టు వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఈసీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ఎన్నికల సంఘంకు సుతిమెత్తగా మొట్టికాయలు వేసింది. రాజ్యాంగబద్ధమైన సంస్థలు మీడియాపై ఫిర్యాదు చేయడం కంటే… తమ విధులను సక్రమంగా నిర్వహించేందుకు యత్నించాలని హితవు పలికింది. ఆర్టికల్ 19 భావప్రకటనా స్వేచ్ఛను కేవలం ప్రజలకు మాత్రమే కల్పించలేదని… ఆ హక్కులు మీడియాకు కూడా వర్తిస్తాయని తెలిపింది. మీడియాపై ఆంక్షలు విధించి తాము తిరోగమనంలో పయనించలేమని చెప్పింది