తన కుమారుడ్ని ఎక్కడికి తరలించారంటూ డీజీపీని ప్రశ్నించిన సీఎం కేసీఆర్ అన్న కుమార్తె!
- అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఎన్ఎస్ యూఐ
- పలువురు విద్యార్థి నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు!
- వారిలో రమ్య రావు కుమారుడు రితేశ్ కూడా ఉన్నట్టు సమాచారం
- అరెస్ట్ చేసినట్టు చూపించడంలేదన్న రమ్య రావు
సీఎం కేసీఆర్ అన్న కుమార్తె రమ్య రావు తన కుమారుడు రితేశ్ రావు ఆచూకీ తెలియడంలేదంటూ డీజీపీని ఆశ్రయించారు. పోలీసులే తన కుమారుడ్ని ఎత్తుకెళ్లి, అరెస్ట్ చేసినట్టు చూపించడంలేదని రమ్య రావు ఆరోపించారు. తన కుమారుడు ఎక్కడున్నాడో చెప్పాలని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సమస్యల పరిష్కారం కోసం ఎన్ఎస్ యూఐ విద్యార్థి సంఘం అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం తెలిసిందే. దాంతో పోలీసులు ముందుజాగ్రత్తగా ఎన్ఎస్ యూఐ నేతలను అదుపులోకి తీసుకున్నారు. వారిలో రమ్య రావు కుమారుడు రితేశ్ రావు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వారిని ఎక్కడికి తరలించారన్నది తెలియరాలేదు.
దాంతో రమ్య రావు నేడు డీజీపీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. దాంతో అక్కడ కాసేపు మాటల వాగ్యుద్ధం నడిచింది. ఎట్టకేలకు సిబ్బంది అనుమతించడంతో డీజీపీని కలిశారు. తన కుమారుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారని, ఎక్కడికి తరలించారో చెప్పాలని నిలదీశారు. అర్ధరాత్రి వేళ తనిఖీల పేరుతో ఇబ్బందికర వాతావరణం సృష్టించారని అసహనం వ్యక్తం చేశారు.