బీజేపీ – ఒవైసీది రామ్ – శ్యామ్ జోడీ.. సంజయ్ రౌత్ విమర్శలు
- అసదుద్దీన్ ఒవైసీ విమర్శలకు సంజయ్ రౌత్ కౌంటర్
- రామ్, శ్యామ్ జోడీ ఎవరిదో అందరికీ తెలుసని వ్యాఖ్య
- శివసేన ఇప్పటికీ బలంగానే ఉందని, ఒంటరిగానే పోరాడుతుందని వెల్లడి
ఉద్ధవ్ థాక్రేపై విమర్శలు చేసిన మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ మండిపడ్డారు. బీజేపీ – ఒవైసీది రామ్ – శ్యామ్ జోడీ అని అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. శివసేన ఒంటరిగానే పోరాడుతుందని స్పష్టం చేశారు. తమ పార్టీ ఇప్పటికీ బలంగానే ఉందని చెప్పారు. వీర్ సావర్కర్.. మహారాష్ట్ర లెజెండ్ అని కీర్తించారు. తమ రాష్ట్ర వీర కుమారుడని చెప్పారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మహారాష్ట్రలోని థానెలో ఓ సభలో మాట్లాడిన అసదుద్దీన్ ఒవైసీ.. ఉద్ధవ్ – షిండే.. రామ్ – శ్యామ్ జోడీ అని ఎద్దేవా చేశారు. ‘‘ఎన్సీపీలో అజిత్ పవార్, సుప్రియా సులే లీడర్లుగా ఎదిగినప్పుడు.. ఉద్ధవ్ థాక్రే తన తండ్రి వల్ల నాయకుడు కాగలిగినప్పుడు.. ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ నాయకులు అయినప్పుడు.. మహారాష్ట్ర ముస్లింలు శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రే, ఏకనాథ్ మాదిరి నాయకులు కాలేరా?’’ అని ప్రశ్నించారు. మహారాష్ట్రలో జరిగే అన్ని ఎన్నికల్లోనూ ఎంఐఎం పోటీ చేస్తుందని ప్రకటించారు.