లాక్ డౌన్ 10 రోజులు కాదు కనీసం 15 రోజులు పెట్టాలి :సీఎల్పీ నేత భట్టి
-ముఖ్యమంత్రి ప్రజల ప్రాణాలను గాలికి వదిలేశారు
-కరోనా కేసులు సంఖ్య పెరగటానికి కేసీఆర్ దే భాద్యత
-మున్సిపల్ ఎన్నికలు వద్దని మొత్తుకున్నా వినలేదు
– కనీసం 15 రోజులు లాక్ డౌన్ ఉండాలి
– కరోనా త్రణకు రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి ఐఏఎస్ ల కమిటీలు ఏర్పాటు చేయాలి
– కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలి
– లాక్ డౌన్ తో చైన్ లింక్ ఆగుతుంది
– పీహెచ్సీని 30 పడకల ఆసుపత్రిగా మార్చాలి
– సెకెండ్ వేవ్ పై ముందే హెచ్చరించినా కేసీఆర్ పట్టించుకోలేదు
– ఢిల్లీ తరహాలో ప్రత్యేక యాప్ ఏర్పాటు చేయాలి
కరోనా నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు. కరోనాను నియంత్రణ చేసేందుకు సీనియర్ ఐఏఎస్ లతో ఒక మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు.. కోవిడ్ ను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన జూమ్ మాధ్యమం ద్వారా పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడానికి కేసీఆరే కారణమని అన్నారు.
రాష్ట్రమంతటా కరోనా కోవిడ్ తో కోన్ని నెలలుగా అతలాకుతలం అవుతుంటే ప్రభుత్వ ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రజలను గాలికి వదిలేసిందని భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరోనతో రాబోయే విపత్కర పరిస్థితులను కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రభుత్వ ద్రుష్టికి తీసుకువచ్చినా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోలేదు. నవ్వులాటలు, గాలి మాటలతో కేసీఆర్.. ప్రజల ప్రాణాలను గాలిలో పెట్టాడని భట్టి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కరోనా నేపథ్యంలో తెలంగాణ మొత్తం 15 రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ పెట్టాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మినిమం క్వారంటైన్ రోజుల పాటు లాక్ డౌన్ పెడితే కరోనా చైన్ లింక్ బ్రేక్ అవుతుందని సైంటిస్టులు, వైద్యులు, ఐ.ఎం.ఎ చెబుతోందని.. దీనిని ఖచ్చితంగా కేసీఆర్ అమలు చేయాలని భట్టి డిమాండ్ చేశారు. కరోనా కోవిడ్ మారుమూల పల్లెటూళ్లకు చేరడంతో అత్యంత పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అందుబాటులో ఆసుపత్రులు లేక.. ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించలేక.. చాలామంది ప్రాణాలు వదిలేస్తున్నారని భట్టి చెప్పారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడానికి సీఎం కేసీఆరే కారణమని అన్నారు. మున్సిపల్ ఎన్నికలు వద్దంటే.. ఎన్నికలు పెట్టారు.. కేసులు పెంచారని విమర్శించారు. వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఎన్నికల తర్వాత భారీగా కేసులు, కరోనా మరణాలు పెరిగాయని చెప్పారు.
గత బడ్జెట్ సమావేశాల్లోనే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని నేను చేసిన సూచనపై ముఖ్యమంత్రి స్పందిస్తూ తప్పనిసరిగా పరీశీలన చేస్తానని చెప్పారు.. ఏడాది గడచినా.. కరోనాను ఇంకా నిర్ణయం తీసుకోలేదని ముఖ్యమంత్రిపై భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు చాలా ముఖ్యమైనవి.. వాటిని కాపాడుకునేందుకు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని భట్టి డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కోవిడ్ ను నియంత్రించేందుకు సీనియర్ ఐఏఎస్ లతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని భట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యాక్సినేషన్, కరోనా టెస్టులు, ట్రీట్ మెంట్.. బెడ్స్.. ఆక్సిజన్ వంటి అన్నింటినీ ఆ కమిటీనే మానిటర్ చేసేలా ఉండాలని చేయాలని ప్రభుత్వానికి భట్టి సూచించారు. కోవిడ్ పరిస్థులును 24 గంటలూ మానిటర్ చేసేలా ప్రత్యేక వ్యవస్థ ఉండాలని భట్టి అన్నారు. కోవిడ్ పరిస్థులను ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఢిల్లీ తరహాలో ఒక యాప్ ను కూడా ప్రభుత్వం ప్రజల కోసం అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అందులో అన్ని ఆసుపత్రులకు సంబంధించిన వివరాలు, ఆక్సిజన్.. బెడ్స్, వెంటిలేటర్ బెడ్స్.. వంటి అన్ని అంశాలు ఉండేలా చూడాలన్నారు.
జిల్లా స్థాయిలో సీనియర్ ఐఏఎస్ అధికారులతో మరో మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసి దానికి జిల్లా కలెక్టర్ కన్వీనర్ గా ఉండాలని చెప్పారు. ఇలాచేస్తే కోవిడ్ ను నియంత్రణ చేయవచ్చిన చెప్పారు. వీటితో పాటు ప్రతి శాననసభ నియోజకవర్గ కేంద్రంలో ఐసొలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భట్టి.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్ని మండల కేంద్రాల్లోని ప్రైమరీ హెల్త్ సెంటర్లను కనీసం ఆక్సిజన్ తో కూడిన 30 పడకల ఆసుపత్రిగా మార్చాలని భట్టి చెప్పారు. డీసెంట్రలైజ్డ్ ట్రీట్ మెంట్ చేయడంతోనే కరోనాను నివారించగలని లేకపోతే కష్టమని భట్టి చెప్పారు.
గ్రామాల్లో కరోనా పాజిటివ్ వచ్చినవారు ఒక్కసారిగా జిల్లా ఆసుపత్రులకు వస్తే.. బెడ్స్ దొరకడం లేదు. రాజధానిలోనూ అదేపరిస్థితి ఉంది.. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవస్థ మొత్తాన్ని మండలస్థాయి వరకూ డీ సెంట్రలైజ్ చేస్తే తప్ప పరిస్థితి అదుపులోకి రాదని ఆయన చెప్పారు.
గత ప్రభుత్వాలు మసూచీ, కలరా, పోలియో వంటివి రాకుండా ఉండేందుకు ఉచితంగా వ్యాక్సిన్లను వెంటబడి మరీ వేయించింది. కరోనా వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భట్టి చెప్పారు. నాలుగుకోట్ల జనాభాకు ఎన్ని డోసులు కావాలి? ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి? అన్న వాటిపై ఖచ్చితమైన యాక్షన్ ప్లాన్ ఈ ప్రభుత్వం దగ్గర లేదని అన్నారు. వ్యాక్సిన్ల ధర విషయంలోనూ కేంద్రాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించడం లేదన్న అనుమానాన్ని భట్టి వ్యక్తం చేశారు. అన్ని పనులు పక్కన పెట్టి యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ చేపట్టాలన్నారు. అక్రమంగా చెరువును ఆక్రమించి హాస్పిటల్ కట్టిన మల్లారెడ్డిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మల్లారెడ్డి ఆసుపత్రి ముందు.. ఐసొలేట్ సెంటర్ గా మార్చాలని ఆందోళన చేసిన ఎన్.ఎస్.యూ.ఐ నాయకులపై నాన్ బేలబుల్ కేసులు పెట్టడం దారుణమని భట్టి విమర్శించారు . వెంటనే వాటిని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.