ఇండోర్ టెస్టులో ఘోర పరాజయానికి రోహిత్ శర్మ చెప్పిన కారణాలు ఇవే!
- ఇండోర్ లో ఆసీస్ దే విజయం
- మూడో రోజు తొలి సెషన్ లోనే ముగిసిన మ్యాచ్
- అనేక అంశాలు ఏమాత్రం అనుకూలించలేదన్న రోహిత్ శర్మ
- తొలి ఇన్నింగ్స్ లోనే ఓటమికి బీజం పడిందని వెల్లడి
భారత్ లో పిచ్ లు స్పిన్ కు అనుకూలమని తెలిసిందే. కానీ ఇండోర్ లో పిచ్ అంచనాలకు అందని రీతిలో ఆతిథ్య భారత్ నే బోల్తా కొట్టించింది. తొలి రెండ్రోజులు స్పిన్నర్లకు విశేషంగా సహకరించిన ఇక్కడి హోల్కర్ స్టేడియం పిచ్ మూడో రోజు మాత్రం బ్యాటింగ్ కు అనుకూలంగా మారింది. టీమిండియా స్పిన్నర్లు ఏమంత ప్రభావం చూపకపోగా, దూకుడుగా ఆడిన ఆసీస్ 76 పరుగుల విజయలక్ష్యాన్ని 1 వికెట్ నష్టానికి ఛేదించింది. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తమ ఘోర పరాజయానికి కారణాలు చెప్పాడు.
- ఓ టెస్టులో మనం ఓడిపోయామంటే అనేక అంశాలు మనకు ప్రతికూలంగా మారాయని గుర్తించాలి.
- అసలు ఈ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లోనే ఓటమికి బీజం పడింది.
- ఇలాంటి పిచ్ పై వీలైనన్ని పరుగులు సాధించడం ఎంత ముఖ్యమో గ్రహించేలోపే ఆలౌటయ్యాం.
- రెండో ఇన్నింగ్స్ లోనైనా స్కోరు చేద్దామనుకుంటే… అక్కడా విఫలమయ్యాం.
- తొలి ఇన్నింగ్స్ లో మెరుగైన స్కోరు సాధించి ఉంటే ఫలితం ఇలా ఉండేది కాదు.
- డబ్ల్యూటీసీ ఫైనల్ గురించి ఇప్పుడేమీ ఆలోచించడంలేదు. ఇంకా అహ్మదాబాద్ టెస్టు జరగాల్సి ఉంది.
- తొలి రెండు టెస్టు మ్యాచ్ ల్లో ఎలా గెలిచామో ఓసారి పరిశీలిస్తాం. పిచ్ లతో సంబంధం లేకుండా నాణ్యమైన ఆటతీరును కనబర్చడంపై దృష్టి సారిస్తాం.
- ప్రణాళిక ప్రకారం ఆడితే చాలని భావిస్తున్నాం.
- ముఖ్యంగా, సవాళ్లు విసిరే పిచ్ లపై ఆడాలంటే గుండె ధైర్యం కావాలి.
- ఆసీస్ బౌలర్లు సరైన స్పాట్ లో బంతులు విసిరేందుకు మేమే వారికి అవకాశం కల్పించాం. వారిపై ఎదురుదాడి చేసుంటే వారి లెంగ్త్ దెబ్బతిని ఉండేది… కానీ ఆ పని చేయలేకపోయాం.
- ఆసీస్ బౌలర్ నాథన్ లైయన్ ప్రతిభను తక్కువ చేసి చెప్పలేం. సరైన ప్రదేశాల్లో బంతులు విసిరి మమ్మల్ని తీవ్రంగా ఇబ్బందిపెట్టాడు. ఈ పిచ్ పై మాకు సవాల్ గా మారాడు.
- కొందరు కీలకమైన ఆటగాళ్లు రాణించాలని కోరుకుంటున్నాను… అది కూడా జట్టు కోసం