తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధిస్తూ.. తీసుకొన్న నిర్ణయానికి అనుగుణంగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేటి నుంచి లాక్‌డౌన్ మార్గదర్శకాలు అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు. బుధవారం నగరంలోని పలు ప్రాంతాలలో పర్యటించిన పోలీస్ కమిషనర్ లాక్ డౌన్ అమలు, పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి పోలీస్ అధికారులకు తగిన సూచనలు చేశారు.
నేటి నుంచి పదిరోజుల పాటు
ప్రజల అవసరాల కోసం ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నీ కార్యకలాపాలకు/ అన్నిరకాల షాపులకు ప్రభుత్వం సడలింపు కల్పించిన నేపథ్యంలో స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ….బౌతికదూరం, మాస్కులు ధరించాలని సూచించారు.
ప్రభుత్వం అత్యవసర సర్వీసులకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు కల్పించిన రంగాలకు మినహా ఉదయం 10 గంటల తరువాత లాక్ డౌన్ కఠినంగా అమల్లో ఉంటుందని తెలిపారు.
పోలీస్ చెక్ పోస్ట్ లు, పికెటింగ్స్ ఏర్పాటు చేసి ముమ్మరంగా వాహనాలు తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు.
జాతీయ రహదారులపై గూడ్స్ రవాణా పై ఏవిధమైన ఆంక్షలు లేవని, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు
తమ అక్రిడేషన్లు కానీ, పత్రికా పరమైన గుర్తింపు కార్డులు తమవెంట ఉంచుకోవాలని స్పష్టం చేశారు.
ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు వారి శాఖా పరమైన గుర్తింపు కార్డులుంటే సరిపోతుందని తెలిపారు.
ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై డిజాస్టర్ మేనేజిమెంట్ చట్టం తో పాటు ఐ.పీ.సి సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
ఈ-పాస్ ద్వారానే ప్రత్యేక పాసుల జారీ.
అత్యవసర పరిస్థితుల్లో వేరే రాష్ట్రాలకూ, ఇతర జిల్లాలకు ప్రయాణం చేసే వారికి ఈ- పాస్ విధానం ద్వారా సంబంధిత పాసులను జారీ చేస్తామని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు.
ఈ- పాస్ లకు గాను https://policeportal.tspolice.gov.in/ అనే వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించారు.
లాక్ డౌన్ సడలింపు సమయమైన ఉదయం 6 గంటల నుండి 10 గంటల లోపు ప్రయాణించే వారికి ఏవిధమైన పాసులు అవసరం లేదని స్పష్టం చేశారు.