- కార్యాచరణను వేగవంతం చేసిన ఈటల రాజేందర్
- నిన్న డీఎస్ తో గంటన్నర సేపు భేటీ
- మీ పలుకుబడి బాగా పెరిగిందనన్న డీఎస్
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన కార్యాచరణను వేగవంతం చేసినట్టే కనపడుతోంది. పలువురు కీలక నేతలను కలుస్తూ రాష్ట్రంలో ఆయన రాజకీయ వేడిని పెంచుతున్నారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ ను ఆయన నిన్న కలవడం చర్చనీయాంశంగా మారింది. దాదాపు గంటన్నరసేపు వీరిద్దరూ భేటీ అయ్యారు. భేటీ సమయంలో ఈటలకు డీఎస్ పలు సూచనలు చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
టీఆర్ఎస్ పార్టీలో తనకు జరిగిన అన్యాయాన్ని ఈ సందర్భంగా డీఎస్ కు ఈటల వివరించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా డీఎస్ కీలక వ్యాఖ్యలు చేయడమే కాకుండా… ఈటలకు పలు సూచనలు చేశారు.
టీఆర్ఎస్ పార్టీకి చెందిన అధికారిక మీడియాలో భూకబ్జా ఆరోపణలు వచ్చాయని, ఆ వెంటనే సీఎం కేసీఆర్ చాలా వేగంగా స్పందించారని, వెంటనే మిమ్మల్ని (ఈటల) కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారని డీఎస్ అన్నారు. ఈ పరిణామాల వల్ల మీ పలుకుబడి చాలా పెరిగిందని… తెలంగాణ ప్రాంత చరిత్రలో మీకు వచ్చినంత సానుభూతి మరెవరికీ రాలేదని చెప్పారు. ప్రజల నుంచి వస్తున్న సానుభూతిని, పెరిగిన పలుకుబడిని నిలుపుకోవాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మిమ్మల్ని ఎంతో మంది వచ్చి కలుస్తుంటారని… కొందరు నిజాయతీగా ఉంటారని, మరికొందరు అనుకూలంగా ఉన్నట్టు నటిస్తుంటారని, కొందరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారని, చాలా జాగ్రత్తగా ఉండాలని ఈటలను హెచ్చరించారు. చాలా సహనంతో వ్యవహరించాలని సూచించారు.