- బీఆర్ఎస్ కోటకు బీటలు వారుతున్నాయన్న రేవంత్
- కేసీఆర్ ను నమ్ముకున్నవారు ఆయన చేతిలో మోసానికి గురయ్యారని వ్యాఖ్య
- పొంగులేటి, జూపల్లి ఇద్దరూ తనకు పాత మిత్రులేనన్న రేవంత్
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందిస్తూ బీఆర్ఎస్ కోటకు బీటలు వారుతున్నాయని చెప్పారు. పొంగులేటి, జూపల్లి ఇద్దరూ తనకు పాత మిత్రులేనని అన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తన సహచర ప్రజాప్రతినిధిగా జూపల్లి ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. పొంగులేటితో మంచి పరిచయం ఉందని చెప్పారు. కేసీఆర్ చేతిలో మోసపోయిన వారిని చూస్తే తనకు సానుభూతి కలుగుతుందని అన్నారు.
కేసీఆర్ ను నమ్ముకున్నందుకు పొంగులేటి మాజీ ఎంపీగా, జూపల్లి మాజీ ఎమ్మెల్యేగా మారిపోయారని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ను నమ్ముకున్న ఎందరో ఆయన చేతిలో మోసానికి గురయ్యారని విమర్శించారు. ఈ జాబితాలో కడియం శ్రీహరి, మండవ వెంకటేశ్వరరావు, పట్నం మహేందర్ రెడ్డి లాంటి వారు ఉన్నారని చెప్పారు. పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ లోకి వస్తారా? అనే అంశంపై స్పందిస్తూ… వారి ఇళ్లకు తానే వెళ్లాలా?, లేక వారే తమ పార్టీ కార్యాలయానికి వస్తారా? అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుందని చెప్పారు. తద్వారా… వారిద్దరూ కాంగ్రెలోకి వస్తారనే విధంగా పరోక్షంగా సంకేతాలను ఇచ్చారు.