దంతెవాడ: జవాన్ శవపేటికను మోసిన ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి!
- జవాన్ల త్యాగం వృథా కానివ్వమన్న సీఎం భూపేష్
- నక్సలైట్లపై పోరాటం ఉద్ధృతం చేస్తామని వ్యాఖ్య
- కుటుంబ సభ్యుల రోదనల మధ్య స్వస్థలాలకు శవపేటికల తరలింపు
ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో నక్సలైట్లు మందుపాతర పేల్చడంతో 10 మంది జవాన్లు, ఒక బస్సు డ్రైవర్ మృతి చెందిన విషయం తెలిసిందే. గురువారం ముఖ్యమంత్రి భూపేష్ భాగెల్ సహా పలువురు మృతులకు నివాళులు అర్పించారు. భారత్ మాతాకీ జై నినాదాల మధ్య, జవాన్ల కుటుంబ సభ్యులు, పౌరుల కన్నీటి మధ్య మృతదేహాలను స్వగ్రామాలకు తరలించారు. నిన్న దంతెవాడలో పోలీసులు ప్రయాణిస్తున్న మినీ బస్సును టార్గెట్ గా చేసుకొని ఐఈడీ మందుపాతర పేల్చారు నక్సలైట్లు. వీరు మావోయిస్ట్ వ్యతిరేక కూంబింగ్ ఆపరేషన్ కోసం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఈ దాడి జరిగింది.
ఈ రోజు అమరజవాన్ల వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించిన అనంతరం సీఎం భూపేష్ మాట్లాడుతూ… జవాన్ల త్యాగం వృథా కానివ్వమని చెప్పారు. నక్సలైట్ల పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని చెప్పారు. కాగా, అమర జవాన్ల మృత దేహాలను వాహనాలలో స్వస్థలాలకు తరలించే సమయంలో సీఎం భూపేష్… ఒక జవాన్ శవపేటికను తన భుజంపై మోశారు.