Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

నా భర్తను జైల్లో చంపేస్తారు: రఘురామ భార్య రమాదేవి

  • రఘురామను గుంటూరు జైలుకు తరలించిన పోలీసులు
  • తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన రఘురామ అర్ధాంగి
  • తన భర్తేమీ క్రిమినల్ కాదని వెల్లడి
  • ఏదైనా జరిగితే సీఎం జగన్, డీఐజీ సునీల్ బాధ్యత వహించాలని వ్యాఖ్యలు

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ అధికారులు గుంటూరు జిల్లా జైలుకు తరలించిన నేపథ్యంలో, ఆయన అర్ధాంగి రమాదేవి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన భర్తను జైల్లో చంపడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. ఇప్పటికే కడపకు చెందిన వ్యక్తులను జైలుకు పక్కా ప్రణాళికతో ముందుగానే తరలించారని వివరించారు.

తన భర్తను మొన్న సాయంత్రం అరెస్ట్ చేసి తీసుకెళ్లారని, అర్ధరాత్రి వేళ ఆయనను తీవ్రంగా కొట్టారని వెల్లడించారు. సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ ను వెనక్కి తీసుకోవాలని రఘురామను బెదిరించారని, ఆయన అందుకు అంగీకరించకపోవడంతో బాగా కొట్టారని తెలిపారు. ఆయన అరెస్టయిన సమయంలో బాగా నడుచుకుంటూ వెళ్లారని, అలాంటిది ఒక్కరోజులో పరిస్థితి మారిపోయిందని రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు.

రమేశ్ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి ఉన్నా, కేవలం జీజీహెచ్ తోనే సరిపెట్టారని, ఆయన వెంట భద్రతా సిబ్బంది లేరని, కుటుంబసభ్యులం తాము కూడా లేమని, ఇవాళ హైకోర్టులో విచారణ ఉన్నప్పటికీ జైలుకు తరలించారని అన్నారు. దీని వెనుక కుట్ర ఉందని భావిస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్తకు ఏదైనా జరిగితే సీఎం జగన్, ఏపీ సీఐడీ డీఐజీ సునీల్ కుమార్ బాధ్యత వహించాలని హెచ్చరించారు.

తన భర్తేమీ క్రిమినల్ కాదని, ఉగ్రవాది అంతకన్నా కాదని రమాదేవి స్పష్టం చేశారు. నేరాలు చేసినవారందరూ హాయిగా తిరుగుతున్నారని మండిపడ్డారు. తన భర్త రఘురామరాజును తాను ఇప్పుడు చూడాలనుకుంటున్నానని, ఆయన పరిస్థితి ఏంటన్నది తెలుసుకోవాలనుకుంటున్నానని అన్నారు.

Related posts

సిద్ధరామయ్య నేపద్యం….

Drukpadam

ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి చుక్కెదురు.. 

Drukpadam

రైలు ఎక్క‌డానికి ప్లాట్ ఫామ్ టికెట్ ఉంటే చాలు.. ఆ త‌ర్వాత టికెట్ తీసుకోవ‌చ్చు!

Drukpadam

Leave a Comment