ఓట్ల కోసమే బీసీ బందు …మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైర్..!
-మంత్రి అజయ్ కు పరోక్ష హెచ్చరికలు
-మంత్రి అజయ్ ను ఓడించేందుకు ఓ బచ్చాగాడు చాలు
-తెలంగాణ బచావో అన్న ప్రొఫెసర్ కోదండరాం
-హాజరైన ప్రొఫెసర్ కోదండరాం, మాజీ మంత్రి జూపల్లి
9 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఏనాడు బీసీలు గుర్తుకు రాలేదని మరో సారి ఎన్నికల్లో గెలుస్తామా లేదా అనే భయంతో బీసీలను మభ్యపెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ బందు ప్రకటిస్తున్నారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 కి గాను 9 అసెంబ్లీ నియోజకవర్గాలు పొంగులేటి శీనన్న ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి కాగా ఆదివారం ఖమ్మం నియోజకవర్గం సమ్మేళనంతో అన్ని పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఖమ్మం నగరంలోని ఎస్ ఆర్ గార్డెన్స్ వెనక ప్రాంతంలో ఏర్పాటు చేసిన సభకు భారీగా జనం హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ పొంగులేటి మాట్లాడుతూ 6 దశాబ్దాల పాటు తెలంగాణ కలల సహకారం కోసం ఎదురు చూసి, తెలంగాణ ఉద్యమం సమయంలో జేఏసీ చైర్మన్ గా వ్యవహరించిన ప్రొఫెసర్ కోదండరామ్ పరిస్థితి చూస్తే అర్థమవుతుందన్నారు.
తెలంగాణ వచ్చిన తర్వాత కల్వకుంట్ల కుటుంబమే లబ్ధి పొందిందన్నారు. రైతుల పంటలని గిట్టు బాటు ధరకు ప్రభుత్వం కొని ఉంటే రైతుబంధు అవసరం లేదన్నారు. గతంలో డబుల్ బెడ్ రూమ్ ఒక ఇంటికి 5 లక్షల రూపాయలు ఖర్చు చేయిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇటీవల జరిగిన క్యాబినెట్లో 3 లక్షల వ్యయం లెక్కలు కట్టడం విడ్డురంగా ఉందన్నారు. ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అని ప్రశ్నించారు. ధరణితో అనేక మంది భూ సమస్యలతో బాధపడుతుండగా కల్వకుంట్ల కుటుంబం మాత్రం ఆక్రమించుకున్న భూములను సక్రమం చేసుకుందన్నారు.
ఖమ్మం చుట్టూ ఉన్న మట్టి కొండలను మంత్రి, ఆయన అనుచరులు దోచుకుంటున్నారని పరోక్షంగా స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉద్దేశించి పొంగులేటి ఘాటు వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో ఉన్న ఓ కుటుంబం ప్లాట్ రక్షణ కోసం మంత్రి వెంట ఉండే కార్పొరేటర్ స్వయంగా రంగంలో దిగి ఫ్లాట్ కాపాడుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. నల్ల రోడ్లు వేసి, మినుగు మినుగు లైట్లు ఏర్పాటు చేస్తే సరిపోదని మనిషి స్వేచ్ఛగా బతికేందుకు వాతావరణం కల్పించాలన్నారు. ప్రజా దీవెన ముందు ఎంత పుడుంగి అయినా తలవంచాల్సిందే అన్నారు. పోలీస్ రెవెన్యూ అధికారులు న్యాయబద్ధంగా పనులు చేయాలని ఎవరో ప్రజా ప్రతి నిధి చెప్పారని చేయకూడదు అన్నారు.
ఓ మహిళ నాయకురాలు తనపై పోటీ చేయాలని మంత్రి అజయ్ సవాల్ విసిరారని అంత పెద్ద నేతలు అవసరం లేదని సమయం వచ్చినప్పుడు శీనన్న కాదు బచ్చా గాడిని రంగంలో దింపి ఓడిస్తామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీలో బిఆర్ఎస్ ఓడించేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ మనం అనుకున్న తెలంగాణ రాలేదన్నారు. బచావో తెలంగాణ కు పిలిపిస్తున్నామన్నారు. ఏ లక్ష్యం, త్యాగం కోసం తెలంగాణ వచ్చిందో నేటికి నెరవేరలేదన్నారు. మార్కెట్లో రైతులు దోపిడి గురవుతున్నారని అన్నారు.
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కి ఖతం చేయాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. బీసీలను మభ్య పెట్టడానికే బీసీ బందు ప్రకటన చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర అప్పులు వడ్డీలు చెల్లించేందుకు విచ్చల విడిగా మద్యం అమ్మకాలు చెప్పట్టారని విమర్శించారు. మూడోసారి ఎన్నికయ్యే నైతిక అర్హత ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేదన్నారు. ఈ సమావేశంలో పొంగులేటి శీనన్న నాయకులు స్వర్ణకుమారి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పీ
చైర్మన్ కోరం కనకయ్య, విజయ్ బాబు, రవి, జైపాల్, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, రాజా, విజయ్ భాయి, రోషన్న తదితరులు పాల్గొన్నారు.