సముద్రంలో మునిగిన పడవ, 37 మంది వలసదారుల గల్లంతు…
- ట్యూనీషియా పోర్ట్ ఆఫ్ స్పాక్స్ నుండి 46 మంది వలసదారులతో బయల్దేరిన పడవ
- మధ్యలో బలమైన గాలుల కారణంగా బోల్తా పడిన పడవ
- మరో నౌక ద్వారా ప్రాణాలు దక్కించుకున్న ఐదుగురు
వలసదారులతో వెళ్తోన్న ఓ పడవ మధ్యధరా సముద్రంలో బోల్తాపడింది. ట్యూనీషియా – ఇటలీ మధ్య సముద్రంలో మునిగిపోవడంతో దాదాపు 37 మంది గల్లంతయ్యారు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. ట్యూనీషియా పోర్ట్ ఆఫ్ స్పాక్స్ నుండి 46 మంది వలసదారులతో ఓ పడవ ఇటలీకి బయలుదేరింది. మధ్యలో బలమైన గాలుల కారణంగా వీరు ప్రయాణిస్తున్న పడవ ఇటాలియన్ ద్వీపం లాంపెడుసా వద్ద సముద్రంలో బోల్తాపడింది. ఈ పడవలో ఏడుగురు మహిళలు, ఓ చిన్నారి సహా మొత్తం 37 మంది గల్లంతు కాగా, ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు. వీరు ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురైన సమయంలో మరో పడవ రావడంతో వీరు ప్రాణాలతో బయటపడినట్లు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ తెలిపింది.
ఉపసహారా ప్రాంతం నుండి వచ్చి ట్యూనీషియాలో అక్రమంగా నివసిస్తున్న వారిపై స్థానిక ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఆఫ్రికాలో నెలకొన్న అస్థిర పరిస్థితులు, ఆర్థికమాంద్యం కారణంగా అక్కడ జాత్యహంకార దాడులు పెరిగాయి. దీంతో ప్రజలు యూరప్ దేశాలకు వలస వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ట్యూనీషియా నుంచి మధ్యధరా సముద్రం అంతటా వలసలు పెరిగిపోయాయి.