- బుధవారం పొద్దుపోయాక బీజేపీ కీలక నేతల భేటీ
- లోక్‌సభ ఎన్నికలు, పార్టీలో వ్యవస్థాగత మార్పులపై చర్చ
- ‘కర్ణాటక ఓటమి’ నేపథ్యంలో బీజేపీ వ్యూహంలో మార్పులు ఉంటాయంటున్న విశ్లేషకులు
వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇంట కీలక సమావేశం జరిగింది. బుధవారం పొద్దుపోయాక జరిగిన ఈ భేటీలో హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర కీలక నేతలు పాల్గొన్నారు. దాదాపు అయిదు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ఎన్నికల కసరత్తుతో పాటూ పార్టీ వ్యవస్థాగత అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అయితే, ఈ భేటీపై బీజేపీ అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.
అమెరికా, ఈజిప్టు పర్యటనలు ముగించుకున్న వెంటనే ప్రధాని మోదీ ఎన్నికల కదనరంగంలోకి దిగిపోయారు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఇటీవల ప్రసంగించిన మోదీ ఉమ్మడి పౌర స్మృతి ప్రస్తావన తెచ్చి వచ్చే ఎన్నికల ఎజెండా ఏమిటో చెప్పకనే చెప్పారు. కర్ణాటకలో ఓటమి అనంతరం బీజేపీ తన వ్యూహంలో కొద్దిపాటి మార్పులు చేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, చత్తీస్‌ఘడ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్ మినహా మిగతా రాష్ట్రాల్లో ప్రతిపక్షాలే అధికారంలో ఉన్నాయి. రాజస్థాన్‌లో ‘రివాల్వింగ్ డోర్’ ఒరవడిని తనకు అనుకూలంగా మార్చుకోవాలనేది బీజేపీ తలంపుగా ఉంది. ఇక తెలంగాణ, చత్తీస్‌ఘడ్‌లో ప్రభుత్వ వ్యతిరేకత తనకు లాభిస్తుందని బీజేపీ కీలక నేతలు భావిస్తున్నారు.