రాజీనామా చేసేందుకు ఇంటి నుండి బయటకు వచ్చి.. మళ్లీ ఇంట్లోకి వెళ్లిన మణిపూర్ సీఎం…
- రాష్ట్రంలో ఉద్రిక్త పరిణామాల నేపథ్యంలో సీఎం బీరెన్ రాజీనామా చేస్తారని వార్తలు
- రాజీనామా చేస్తే అడ్డుకుంటామని సీఎం నివాసం వద్ద కార్యకర్తల ఆందోళన
- రాజీనామా చేసేందుకు వెళ్తున్న సీఎంను అడ్డగించిన వైనం
- ప్రజల నుండి వస్తున్న మద్దతును చూసి నిర్ణయం మార్చుకున్నట్లు చెప్పిన సీఎం
అట్టుడుకుతున్న మణిపూర్ లో శుక్రవారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉద్రిక్త పరిస్థితుల మధ్య ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామాకు సిద్ధపడ్డారు. అయితే ఈ నిర్ణయాన్ని మద్దతుదారులు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆయన చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజీనామా చేయడం లేదని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దీంతో చించేసిన రాజీనామా పత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రాష్ట్రంలోని పరిస్థితుల నేపథ్యంలో సీఎం రాజీనామా చేస్తారని ఉదయం నుండి వార్తలు చక్కర్లు కొట్టాయి. మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తో భేటీ కానున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలు రావడంతో సీఎం మద్దతుదారులు ఆయన నివాసానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. సీఎంను రాజీనామా చేయనివ్వబోమని, గవర్నర్ వద్దకు వెళ్తే అడ్డుకుంటామని చెప్పారు. అన్నట్లుగానే సీఎం బీరెన్ సింగ్ తన నివాసం నుండి కాన్వాయ్ లో బయటకు రాగానే, పెద్ద ఎత్తున వచ్చిన మహిళలు అడ్డుకున్నారు. సీఎం తిరిగి తన నివాసంలోకి వెళ్లిపోయారు.
ప్రజల నుండి వస్తున్న మద్దతును చూసి తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో చించేసిన రాజీనామా పత్రాలు కనిపించాయి. సీఎం చేతుల్లో నుండి రాజీనామా పత్రాన్ని మహిళా కార్యకర్తలు లాక్కొని, చించేసినట్లుగా తెలుస్తోంది. రిజర్వేన్ల విషయంలో మైతేయ్, కుకీల మధ్య వైరం, ఆ తర్వాత మే 3న గిరిజన సంఘీభావ ర్యాలీ హింసాత్మకంగా మారడంతో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దాదాపు యాభై రోజులుగా అల్లర్లు కొనసాగుతున్నాయి.