Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

పీఎన్‌బీ కుంభకోణం కేసు.. పరారీలో ఉన్న మెహుల్ చోక్సీ అదృశ్యం…

పీఎన్‌బీ కుంభకోణం కేసు.. పరారీలో ఉన్న మెహుల్ చోక్సీ అదృశ్యం…
పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో ఆరోపణలు
కేసు బయటకు వచ్చిన తర్వాత అంటిగ్వాకు పారిపోయిన వైనం
డిన్నర్ కోసం రెస్టారెంట్‌‌కు వెళ్లి అదృశ్యం
ఇంకా ప్రకటన చేయని అంటిగ్వా పోలీసులు
పరారీలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) కుంభకోణం కేసు నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ (61) అదృశ్యమయ్యాడు. కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత భారత్ నుంచి పారిపోయి అంట్విగ్వా అండ్ బార్బుడాలో తలదాచుకుంటున్న చోక్సీ అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. ఈ విషయాన్ని చోక్సీ న్యాయవాది విజయ్ అగర్వాల్ నిర్ధారించారు.

మెహుల్ చోక్సీ అదృశ్యంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారని విజయ్ అగర్వాల్ తెలిపారు. చోక్సీ అదృశ్యంపై అంటిగ్వా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. చోక్సీ రక్షణపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని అగర్వాల్ పేర్కొన్నారు.

చోక్సీ కోసం పోలీసులు ఇప్పటికే వెతుకులాట ప్రారంభించారని అక్కడి మీడియా వర్గాలు పేర్కొన్నాయి. గత సాయంత్రం డిన్నర్ కోసం చోక్సీ ప్రముఖ రెస్టారెంట్‌కు వెళ్లిన తర్వాత మళ్లీ కనిపించలేదు. అయితే, అతడి వాహనం మాత్రం సాయంత్రం పొద్దుపోయాక జాలీ హార్బర్‌లో గుర్తించారు. అయితే అతడి జాడ మాత్రం తెలియరాలేదు. చోక్సీ అదృశ్యంపై అంటిగ్వా పోలీసులు ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు.

పీఎన్‌బీ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం విడిచి పారిపోయిన మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీలను సీబీఐ, ఈడీలు దేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటీవల అంటిగ్వా ప్రధాని గాస్టన్ బ్రౌన్ మాట్లాడుతూ.. చోక్సీ పౌరసత్వాన్ని రద్దు చేసి అతడిని భారత్‌కు అప్పగిస్తామని చెప్పారు.

కాగా, తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి చోక్సీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చోక్సీ మేనల్లుడు నీరవ్ మోదీ ప్రస్తుతం యూకేలో ఉంటున్నాడు. అతడిని కూడా భారత్‌కు రప్పించేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి.

Related posts

సోషల్ మీడియాలో పరిచయమైన మహిళను ఆసుపత్రికి పిలిచిన వైద్యుడు..

Drukpadam

అమెరికాకు అక్రమ వలస యత్నం.. వృద్ధుడిలా నటిస్తూ పట్టుబడ్డ భారత యువకుడు!

Ram Narayana

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్.. ముగ్గురు మావోయిస్టుల హ‌తం

Ram Narayana

Leave a Comment